ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ ఉద్ఘాటన
- రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తా..
- దేశ సరిహద్దుల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా
- నా అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు
- వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కోవింద్ భేటీ
- రాష్ట్రపతి, స్పీకర్ వంటి ఉన్నత పదవులకు పోటీ వద్దు: జగన్
- రామ్‌నాథ్ కోవింద్‌కు వైఎస్ జగన్ పాదాభివందనం
సాక్షి, హైదరాబాద్: తాను భారత రాష్ట్రపతిగా ఎన్నికైతే ఆ పదవి ఔన్నత్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుతానని, రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తానని జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీఏ) రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. రాష్ట్రపతి పదవి హుందా తనాన్ని, గౌరవాన్ని ఇనుమడింపజేస్తానని పేర్కొన్నారు. తన అభ్యర్థిత్వానికి మద్దతు కోరుతూ ప్రచారంలో భాగంగా హైదరాబా ద్‌కు వచ్చిన కోవింద్ మంగళవారం హోటల్ పార్క్ హయత్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి లో సైనిక దళాల సుప్రీం కమాండర్ హోదాలో దేశ సరిహద్దుల పరిరక్షణకు శక్తివంచన లేకుం డా కృషి చేస్తానన్నారు. బాబూ రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి ఎందరో మహానుభావులు రాష్ట్రపతి పదవిని అధిష్టించి దేశానికి మరువలేని సేవలందించారని కొనియాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరా బాద్‌కు చెందిన డాక్టర్ జాకీర్ హుస్సేన్, అనంతపురం జిల్లాకు చెందిన డాక్టర్ నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చారని ప్రశంసించారు. ఆ మహానుభావులందరి ఆదర్శాలను అనుకరించే ప్రయత్నం చేస్తాన న్నారు. తన అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటిం చిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నని కోవింద్ అన్నారు. ఎన్డీఏ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించక ముందే జగన్ ముందుకొచ్చి మద్దతు తెలపడం ముదావహం అని చెప్పారు.
కోవింద్ విజయంలో వైఎస్సార్‌సీపీ భాగస్వామి
‘‘నిన్నటి వరకూ అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం అంటూ నీతులు వల్లిస్తోంది. ఆ పార్టీ ఒకప్పుడు దేశంలో ఎమర్జెన్సీని విధించి మానవ హక్కులను హరించింది. నాయకులను జైళ్లకు పంపి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసింది’’ అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కాంగ్రెస్ పార్టీకి చురక అంటించారు. రామ్‌నాథ్ కోవింద్‌ను దళితు డని మాత్రమే భావించరాదని, ఆయనకు కెపాసిటీ (సామర్థ్యం), క్యాలిబర్ (బలం), కాండక్ట్ (నడత), క్యారెక్టర్ (వ్యక్తిత్వం) మెండుగా ఉన్నాయని తనదైన శైలిలో చెప్పారు. కోవింద్‌ను దళితుడనే కారణంతో ఎంపిక చేయలేదని, ఆయనలో ఉన్న శక్తిసా మర్థ్యాలను గుర్తించామన్నారు.
ప్రతిపక్షం మాత్రం కులం పేరుతో రాజకీయం చేయాలని చూస్తోందని ఆరోపించారు. కోవింద్‌కు మద్దతు ఇవ్వడానికి జగన్ ముందుకు రావడం ఆహ్వానించదగిన విషయ మన్నారు. కోవింద్ విజయంలో వైఎస్సార్‌సీపీ కూడా భాగస్వామి అవుతున్నందుకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలా ఓటు వేయాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు వివరించారు. సభా వేదికపై బీజేపీ ఏపీ పరిశీలకుడు గణేశన్, అమర్‌జీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆసీనులయ్యారు. రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కోవింద్‌కు ఘన స్వాగతం
కోవింద్ నిర్ణీత సమయం కంటే 20 నిమిషాలు ముందుగా మంగళవారం ఉదయం 10.55 నిమిషాలకు పార్క్ హయత్ హోటల్ వద్దకు చేరుకున్నారు. ఆయనకు వైఎస్ జగన్‌తో పాటు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పి.మిథున్‌రెడ్డి, బుట్టా రేణుక, వెలగపల్లి వరప్రసాద్, వైఎస్సార్‌సీపీ శాసనసభ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎదురేగి సాదర స్వాగతం పలికారు. వేదికపై ఆసీనులైన తరువాత కోవింద్‌ను జగన్ శాలువాతో సత్కరించారు. మిగతా అతిథులను ఎంపీలు వెలగపల్లి వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, బుట్టా రేణుక సత్కరించిన తరువాత పరిచయ కార్యక్రమం మొదలైంది. తొలుత ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించి కోవింద్‌కు పరిచయం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలందరూ ఒక్కొక్కరుగా వేదికపైకి వెళ్లగా జగన్ పక్కనే నుంచుని వారిని కోవింద్‌కు పరిచయం చేశారు. జగన్, విజయసాయిరెడ్డి కోవింద్‌కు గౌర వ సూచకంగా పాదాభివందనం చేశారు. ఆయన అందరినీ ఆప్యాయంగా పలకరించారు.
రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కావాలి: వైఎస్ జగన్
రామ్‌నాథ్ కోవింద్‌కు తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. రామ్ నాథ్ కోవింద్‌తో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగపరంగా ఉన్నతమైన రాష్ట్రపతి, స్పీకర్ వంటి పదవులకు పోటీ ఉండరాదని తాము విశ్వసిస్తున్నామని, అందువల్లే ఎన్డీయే తన అభ్యర్థిని ఖరారు చేయక ముందే మద్దతు ప్రకటించామని గుర్తుచేశారు. ఒక దళితుడు రాష్ట్రపతి అయ్యే అవకాశం దేశంలో రెండోసారి వచ్చినందుకు అందరూ గర్వపడాలని, కోవింద్‌ను గెలిపిద్దామని పిలుపునిచ్చారు. అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎన్నిక విషయంలో రాజకీయ సిద్ధాంతాలకు తావే ఉండరాదన్నారు. రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ గెలుపు తథ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా జరగాలని, పోటీ అవసరం లేదనే సంప్రదాయాన్ని నెలకొల్పాలని జగన్ కోరారు.