కృష్ణా జలాల సమస్య 4 రాష్ట్రాలదే
♦ ఏపీ, తెలంగాణ, మహారాష్ర్ట, కర్ణాటక మధ్య పంపిణీ చేయాలి
♦ తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయడం చట్టం స్ఫూర్తిని నీరుగార్చడమే
♦ కర్ణాటక, మహారాష్ట్రల వాదనలో పస లేదు
♦ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదనలు
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాల పంపిణీ తప్పనిసరిగా నదీ పరివాహక రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , మహారాష్ట్ర, కర్ణాటకల మధ్య జరగాల్సిందేనని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదించారు. కృష్ణా జలాల పంపిణీని కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయడం ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం స్ఫూర్తిని నీరుగార్చడమేనని పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌ల వారీగా పంపిణీ జరగాలంటే 4 రాష్ట్ర్రాల్లోని ప్రాజెక్ట్‌లను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కృష్ణా జలాల పంపిణీపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు సోమవారం కృష్ణా నదీ పరివాహక రాష్ట్రాల వాదనలు కొనసాగాయి.
ఏపీ ప్రభుత్వం తరఫున ఏకే గంగూలీ వాదనలను కొనసాగించారు. విభజన చట్టంలోని సెక్షన్ 89, అంతర్రాష్ట్ర జలాల వివాదం చట్టంలోని పలు అంశాలను ప్రస్తావించారు. సెక్షన్ 89 ప్రకారం కృష్ణా జలాల పంపిణీని ఎపీ, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితం చేయాలన్న కర్నాటక, మహారాష్ట్రల వాదనలో పస లేదని గంగూలీ స్పష్టం చేశారు. నీటి పంపిణీ తెలుగు రాష్ట్రాల మధ్యనే జరగాలన్న ప్రస్తావన ఏదీ లేదని గుర్తు చేశారు. కృష్ణా జలాల పంపిణీ 4 రాష్ట్రాల సమస్య అని అన్నారు. అంతేకాకుండా ప్రాజెక్ట్‌ల వారీగా మళ్లీ కేటాయింపులు జరపాలని ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా ఉందని వివరించారు.
ఈ దశలో జస్టిస్ బ్రిజేష్ కుమార్ జోక్యం చేసుకుంటూ.... ఎన్ని రాష్ట్రాలకు కేటాయింపులు జరపాలో చట్టంలో లేనందువల్ల తెలుగు రాష్ట్రాలకే నీటి కేటాయింపులను పరిమితం చేయొచ్చు కదా! అని ప్రశ్నించారు. అయితే, ఈ రెండు రాష్ట్రాలకే నీటి కేటాయింపులు జరపాలని కూడా చట్టంలో లేదని గంగూలీ బదులిచ్చారు. నదీ జలాల పంపకాలు జరిపే ముందు, నదిపై కొత్తగా నిర్మించిన ప్రాజెక్ట్‌లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయాల్సి ఉంటుందని, తర్వాతే కేటాయింపులు జరపాలని చెప్పారు. ప్రాజెక్ట్‌ల వారీగా మళ్లీ కేటాయింపులు జరపడానికే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పదవీ కాలాన్ని పొడిగించారని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలో ఎన్ని ప్రాజెక్ట్‌లుఉన్నాయో తెలిసిన తర్వాతే తదనుగుణంగా నీటి కేటాయింపులు జరపడం సాధ్యమవుతుందన్నారు.
గతంలో మొత్తంగా రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరిగాయని, ప్రాజెక్ట్‌ల వారీగా కేటాయింపుల కోసమే విభజన చట్టంలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారని ఏకే గంగూలీ గుర్తుచేశారు. కృష్ణా జలాల పంపిణీ మహారాష్ట్ర, కర్నాటక, ఉమ్మడి ఏపీల మధ్య జరిగిందన్నారు. దీన్ని యథాతథంగా అమలు చేయాలంటే ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉనికిలో లేదన్నారు.
నేడు తెలంగాణ వాదనలు
ప్రాజెక్ట్‌ల వారీగా నీటి కేటాయింపుల గురించి ఏకే గంగూలీ వాదిస్తున్న దశలో బ్రిజేష్ కుమార్ జోక్యం చేసుకుంటూ... ఏపీలోని ప్రాజెక్ట్‌ల వివరాలను కోరారు. విభజన చట్టం 11 షెడ్యూల్‌లోని రెండు ప్రాజెక్ట్‌లు తప్ప మిగిలినవి పూర్తి కాలేదని గంగూలీ తెలిపారు. హంద్రీ-నీవా, కల్వకుర్తి పూర్తయ్యాయని, గాలేరు-నగరి, వెలిగొండ, నెట్టెంపాడు తదితర ప్రాజెక్ట్‌లు నిర్మాణ దశలోనే ఉన్నాయన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లకు నీటి కేటాయింపులు ఎలా సాధ్యమని బ్రిజేష్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంగళవారం వైద్యనాథన్ వాదనలు వినిపిస్తారు.