
మోడీ బ్రిటన్‌లో దర్జాగా ఎలా ఉన్నారు?
న్యూఢిల్లీ: దేశీయంగా పలు అవినీతి కేసుల్లో నిందితుడై పరారీలో ఉన్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ లలిత్ మోడీ బ్రిటన్ నుంచి పోర్చుగల్ వెళ్లేందుకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సహకరించారన్న సమాచారంపై నేడు రాజకీయ వర్గాల్లో దుమారం రేగుతోంది. ఆమె తక్షణం రాజీనామా చేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీతోపాటు మరికొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. పరారీలోఉన్న నిందితుడైన మోడీని భారత్ రప్పించేందుకు స్వయంగా విదేశాంగ మంత్రిగా ఉన్న సుష్మా స్వరాజ్ ఎందుకు ప్రయత్నించలేదని ఏ రాజకీయ పార్టీ మాత్రం ఎందుకు ప్రశ్నించడం లేదు? తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా రాజకీయ పార్టీలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగా మోడీ అవినీతి కార్యకలాపాలతో సంబంధం ఉండడం వల్లనా ? లలిత్ మోడీ చేసిన అవినీతి, అక్రమాలు ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం చూపడం లేదు కనుక ప్రజలుగానీ, ప్రజల పక్షాన పని చేస్తున్న ఎన్జీవో సంస్థలు పాటిస్తున్న మౌనాన్ని అర్థం చేసుకోవచ్చు.
పొద్దునలేస్తే ఒకరికొకరు తిట్టుకుంటూ, దూషణలతో దుమ్మెత్తి పోసుకునే రాజకీయ పార్టీలు అసలు ప్రశ్నలను పక్కన పెట్టి బ్రిటన్ నుంచి పోర్చుగల్ వెళ్లేందుకు మోడీకి ఎందుకు సహకరించారంటూ కొన్ని పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు గగ్గోలు పెడుతోంది? అసలు బ్రిటన్‌లో మాత్రం ఇంతకాలం మోడీని ఎలా ఉంచగలిగారు? తీవ్ర అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న మోడీ , 'బ్లూ కార్నర్' నోటీసులిచ్చినా భారత్‌కు రాకపోవడంతో ఆయన వీసాను కోర్టు ప్రమేయంతో భారత్ ప్రభుత్వం రద్దు చేసింది కదా! అలాంటప్పుడు మరో దేశం వెళ్లడం ప్రశ్నను పక్కన పెడితే వీసా లేకుండా మోడీ బ్రిటన్‌లో దర్జాగా ఎలా ఉంటూ వచ్చారు? పార్లమెంట్ ఎన్నికల ముందు అధికారంలోవున్న కాంగ్రెస్ పార్టీ ఆయన్ని భారత్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకోలేదని భావిస్తే, అవినీతిని అరికట్టే నినాదంతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడంలో ఎందుకు చేష్టలుడిగిందన్నది తార్కికుల ప్రశ్న.
విశేష ప్రాచుర్యం పొందిన ఐపీఎల్ వ్యవస్థాపకుడిగా పేరొపొందిన లలిత్ మోడీ ఇస్టారాజ్యంగా వ్యవహరించి క్రికెట్ బోర్డు అనుమతులు లేకుండా ఏకపక్షంగా ఫ్రాంచెజ్‌లు కేటాయించడం, రిగ్గింగ్ బిడ్‌లకు పాల్పడడం ద్వారా అనతికాలంలోనే అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. 2013, సెప్టెంబర్ నెలలో బీసీసీఐ పదవికి శాశ్వతంగా దూరమయ్యారు. అంతకుముందే ఈ వ్యవహారాలకు సంబంధించి ఆయనపై భారత ఎన్ ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ కేసులు దాఖలు చేసింది. ఈ విచారణ క్రమంలో ఏదో పనిపై లండన్ వెళ్లిన మోడీ, తనకు బిగిసుకోనున్న ఉచ్చును ముందే పసిగట్టి అక్కడే ఉండిపోయారు.
తన ప్రాణాలకు ముప్పుందంటూ భారత్ రావడానికి నిరాకరిస్తూ వచ్చారు. అతన్ని పట్టించాల్సిందిగా కోరుతూ 'రెడ్ కార్నర్' నోటీసు ఇవ్వాల్సిన భారత్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ 'బ్లూ కార్నర్' నోటీసు జారీ చేసింది. రెడ్ కార్నర్ నోటీసు ఇస్తే అరెస్ట్‌చేసి తమకు అప్పగించాల్సిందిగా కోరడం, బ్లూ కార్నర్ నోటీసు ఇవ్వడం అంటే నిందితుడు ఎక్కడున్నాడో తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా అభ్యర్థించడం. కాంగ్రెస్ హయాంలోనే బ్లూ కార్నర్ నోటీసులు ఇచ్చినా మోడీ స్పందించనప్పుడు అప్పుడే ఎందుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వలేదు.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చినా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దాదాపు లలిత్ మోడీ గురించి భారతీయులు మరిచిపోతున్న తరుణంలో సుష్మా స్వరాజ్ చర్య వల్ల మళ్లీ ఆయన కేసు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. స్వయంగా సుష్మా స్వరాజ్ కూతురే లలిత్ మోడీకి న్యాయవాదిగా వ్యవహరించిన విషయం తెల్సిన వారికి సుష్మా నిర్ణయం వెనుక ఎవరి ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవహారాన్ని మొదటి నుంచి పరిశీలిస్తే అవినీతిని అరికట్టడంలో రాజకీయ పార్టీలన్నీ ఒకే తాను ముక్కలని తెలిసిపోతోంది.