
మాజీ సీఎంకు బంపర్ ఆఫర్
పట్నా: బహుజన సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, మాజీ సీఎం మాయావతికి రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ ప్రసాద్ ఊహించని ఆఫర్ ఇచ్చారు. బిహార్ నుంచి ఆమెకు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. ‘మాయావతితో చాలా సేపు మాట్లాడాను. వేధింపులు, బీజేపీ విభజన అజెండాకు వ్యతిరేకంగా పోరాడేందుకు బిహార్ నుంచి రాజ్యసభ సీటు ఇస్తామని ఆమెతో చెప్పాన’ని లాలూ ట్విటర్‌లో వెల్లడించారు.
దళితులపై దాడుల అంశంపై రాజ్యసభలో తనకు మాట్లాడే అవకాశం కల్పించనందుకు నిరసనగా మంగళవారం తన ఎంపీ పదవికి మాయావతి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ఇంకా ఆమోదించలేదు. ఎంపీగా ఆమె పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ముగియనుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బీఎస్పీకి కేవలం 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మళ్లీ ఆమెను రాజ్యసభకు పంపే బలం బీఎస్పీకి లేదు.
మాయావతి కోరుకుంటే బిహార్ నుంచి ఆమెను రాజ్యసభకు పంపుతామని లాలూ ప్రసాద్ చెప్పారు. తాము ఆమె వెంట ఉంటామని భరోసాయిచ్చారు. 2019 సాధారణ ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటు చేసే చర్యల్లో భాగంగానే లాలూ ఈ ఆఫర్ ప్రకటించినట్టు ప్రచారం జరుగుతోంది. అఖిలేశ్ యాదవ్, మాయావతిని కలిపేందుకు కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆగస్టు 27న పట్నాలో నిర్వహించనున్న ర్యాలీని వీరిద్దరినీ లాలూ ఆహ్వానించిన సంగతి తెలిసిందే.