ఆస్పత్రిలో మాజీ సీఎం హల్‌చల్
బిహార్ రాజధాని పట్నాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజి ఆస్పత్రికి ఉన్నట్టుండి ఓ అనుకోని అతిథి వచ్చారు. ఆయన్ను చూసి పేషెంట్లు ఆశ్చర్యపోగా.. డాక్టర్లు పరుగు పరుగున వచ్చారు. ఆయనే.. ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్. ఆయనకు తెలిసున్నవాళ్లు ఎవరో చికిత్స పొందుతుంటే చూసేందుకు వచ్చారేమోనని అందరూ అనుకున్నారు. కానీ.. తన కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోగ్యశాఖ మంత్రి కావడంతో.. అతడి తరఫున ఆస్పత్రిని తనిఖీ చేసేందుకు లాలు వచ్చినట్లు కాసేపటికి అందరికీ అర్థమైంది. లాలు నేరుగా రోగుల వద్దకు వెళ్లి, ఆస్పత్రిలో సేవలు ఎలా ఉన్నాయని అడిగారు. పలు వార్డులను తనిఖీ చేశారు. నిజానికి 1997లో గడ్డి స్కాంలో లాలును జ్యుడీషియల్ కస్టడీకి పంపినప్పుడు ఆయన ఇదే ఆస్పత్రిలో చాలా నెలల పాటు ఓ వీఐపీ రూంలో 'పేషెంటు'గా గడిపారు.
అయితే, తాను అక్కడకు దగ్గర్లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి ఓ పేషెంటును కలిసేందుకు వెళ్లానని, దారిలో ఈ ఆస్పత్రి కనిపిస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలని ఆగానని లాలు ఆ తర్వాత మీడియాతో అన్నారు. ఈ వ్యవహారం సీఎం నితీష్‌కుమార్‌కు తలనొప్పులు తెచ్చిపెట్టేలా ఉంది. లాలు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు.. ప్రధానంగా బీజేపీ విరుచుకుపడే అవకాశం స్పష్టంగా ఉంది.