భూసేకరణపై 8 గంటల చర్చ
న్యూఢిల్లీ: వివాదాస్పద భూసేకరణ చట్టం సవరణ బిల్లుపై లోక్‌సభ సోమవారం ఎనిమిది గంటలపాటు చర్చించనుంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న మలివిడత పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానంగా.. ఆర్డినెన్స్‌ల స్థానంలో తీసుకువచ్చిన బిల్లులు, రైల్వే, సాధారణ బడ్జెట్‌లపై ఉభయ సభల్లో చర్చ జరుగుతుందని వివరించింది. లోక్‌సభ కార్యక్రమాల్లో భూసేకరణ బిల్లుపై చర్చతోపాటు రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్‌పై చర్చ, ఓటింగ్ ఉంటుందని పేర్కొంది. దేశంలో రైతుల పరిస్థితిపై కూడా చర్చ ఉంటుందని వెల్లడించింది.
ఇక సోమవారం రాజ్యసభలో ఆర్డినెన్స్ స్థానంలో తీసుకువచ్చిన గనులు, ఖనిజాలు(అభివృద్ధి, క్రమబద్ధీకరణ) సవరణ బిల్లు-2015, మోటార్ వాహనాల (సవరణ) బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఈ రెండు బిల్లులకు లోక్‌సభ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. మోటార్ వాహనాల బిల్లు రాజ్యసభలో ఇప్పటికే పెండింగ్‌లో ఉంది. దీంతోపాటు మరో రెండు బిల్లులు (బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితి పెంపు, ఈ-వేలం ద్వారా బొగ్గు గనుల విక్రయం) కూడా రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల(సవరణ) బిల్లు-2014 కూడా ఇదే సమావేశాల్లో రాజ్యసభ ముందుకు రానుంది. దీన్ని లోక్‌సభ ఇప్పటికే ఆమోదించింది. ఇటీవల తీసుకువచ్చిన ఆరు ఆర్డినెన్స్‌లకు మార్చి 20లోగా పార్లమెంట్ ఆమోదముద్ర వేయించుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏప్రిల్ 5 నాటికల్లా ఆమోదం పొందలేకపోతే ఈ ఆర్డినెన్స్‌లు రద్దయిపోతాయి. మార్చి 20న పార్లమెంట్ వాయిదా పడనుంది. తిరిగి ఏప్రిల్ 20 నుంచి మళ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి.