
పనామా పేపర్స్ లో బాలీవుడ్ జంట సంచలనం
ప్రపంచవ్యాప్తంగా పెను రాజకీయదుమారాన్ని రాజేసిన పనామా పేపర్స్ జాబితాలో ఓ బాలీవుడ్ జంట పేర్లు దర్శనమిచ్చాయి.
న్యూఢిల్లీ: అవినీతి చక్రవర్తుల బాగోతాల గట్టురట్టు చేస్తూ పనామా పేపర్లు సృష్టిస్తున్న ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా పెను రాజకీయ దుమారాన్ని రాజేసిన పనామా పేపర్స్ జాబితాలో తాజాగా ఓ బాలీవుడ్ జంట పేర్లు దర్శనమిచ్చాయి. హీరో సైఫ్ అలీ ఖాన్, ఆయన భార్య బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ పేర్లు ఇందులో ఉండడం మరో సంచలనానికి దారితీసింది. వీరితోపాటు, కరీనా సోదరి కరిష్మా కపూర్, పారిశ్రామికవేత్త, వీడియో కాన్ వేణుగోపాల్ ధూత్‌కు చెందిన సంస్థలు, పుణే కు చెందిన రియల్లర్ చోర్దియా కుటుంబం ఓ విదేశీ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడైంది. గురువారం బయటపడిన ఈ జాబితాలో మరో పది పేర్లు దర్శనమిచ్చాయి.
2010లో ఐపీఎల్ పుణె ఫ్రాంచైజీని సొంతం చేసుకునేందుకు వీడియోకాన్, పంచశీల గ్రూప్ తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, కరిష్మా కపూర్ లు జట్టుకట్టిన వేళ, వీరితో పాటు బీవీఐ (బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్)లో రిజిస్టరైన కంపెనీ ఓడ్బురేట్ లిమిటెడ్ కూడా భాగమైంది. మొత్తం 10 మంది కలిసి పీ-విజన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఓ కన్సార్టియంను ఏర్పాటుచేసి పుణె ఫ్రాంచైజీ కోసం బిడ్ వేయగా, ఈ సంస్థ విఫలమైంది.
తాజాగా మోసాక్ ఫోన్సెకా నుంచి బహిర్గతమైన పత్రాల్లో పీ-విజన్, ఓడ్బురేట్ పేర్లు ఉన్నాయి. పీ-విజన్‌లో ఈ క్రీడల కన్సార్టియంలో చోర్దియా కుటుంబం 33 శాతం అతి పెద్ద వాటాతో ఉండగా.. కరీనా, కరిష్మా 4.5 శాతం, సైఫ్, ముంబై నివాసి మనోజ్ ఎస్ జైన్ 9 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టినట్టు తెలిపింది. దీంతోపాటు వేణుగోపాల్ ధూత్ రెండు గ్రూప్ కంపెనీల ద్వారా 25 శాతం, పంచశీల గ్రూప్ కు 33 శాతం వాటాలున్నాయి. అప్పట్లో జట్టును దక్కించుకోవడంలో విఫలమైన పీ-విజన్ కు పెట్టుబడులు పెట్టిన ఓడ్బురేట్ వెనుక ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అక్టోబరు 2009లో ప్రారంభమైన ఓడ్బురేట్, మార్చి 4, 2010న ఐపీఎల్ బిడ్డింగ్ పేపర్లపై సంతకాలు చేసిందని, జట్టు దక్కకపోవడంతో, ఆ వెంటనే మూతపడిందని మోసాక్ ఫోన్సెకా పత్రాల్లో ఉంది. ఇదే విషయమై వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ ధూత్ ను ప్రశ్నించగా, పీ-విజన్ లో 25 శాతం వాటా గురించి మాత్రమే తనకు తెలుసునని, ఓడ్బురేట్ సహా ఇతర సభ్యులు, వాటాదారుల వివరాలు తెలియవని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ వార్తలపై స్పందించడానికి సైఫ్ దంపతులతో పాటు మిగిలినవారు అందుబాటులో లేనట్టు సమాచారం.
పనామా పేపర్స్ గురువారం బహిర్గతం చేసిన నల్ల కుబేరుల జాబితాలో ఇంకా ఢిల్లీకి చెందిన టైర్ డీలర్, ఒక దుకాణం యజమాని, ఒక ఆస్ట్రేలియన్ గని బిలియనీర్ కుమార్తె, ఒక వస్త్రాల ఎగుమతిదారుడు, ఇంజనీరింగ్ కంపెనీ యజమాని, లోహాలు సంస్థ డైరెక్టర్లు, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఉన్నారు.