రాహుల్ వచ్చారు.. ఎమ్మెల్యే వెళ్లిపోయారు!
రాహుల్ వచ్చారు.. ఎమ్మెల్యే వెళ్లిపోయారు!
Published Mon, Dec 19 2016 10:26 AM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గోవా పర్యటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆయన అలా అడుగుపెట్టారో లేదో, పలువురు నేతలు ఆ పార్టీని వీడి వెళ్లిపోతున్నారని చెప్పారు. ''గోవాలో రాహుల్ గాంధీ పర్యటన ప్రభావం ఏంటో చూడండి.. మొదటిరోజు ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేశారు'' అని మార్గోవా నియోజకవర్గంలో జరిగిన విజయ్ సంకల్ప్ ర్యాలీ సందర్భంగా పర్సేకర్ అన్నారు. ఈనెల 17వ తేదీ శనివారం నాడు రాహుల్ గాంధీ గోవాలో పర్యటించగా.. అదే రోజు ఆ పార్టీ ఎమ్మెల్యే మౌవిన్ గోడిన్హో రాజీనామా చేసి, బీజేపీలో చేరారు.
రెండో రోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి మనోహర్ అస్గావ్‌కర్ కూడా ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయారని.. ఇప్పుడు ఇంకెంత మంది ఆ పార్టీని వీడి బయటకు వస్తారో చూడాల్సి ఉందని అన్నారు. అస్గావ్‌కర్ ఎంజీపీలో చేరారు. తన ర్యాలీకి కనీసం 50 వేల మంది తక్కువ కాకుండా తీసుకురావాలని స్థానిక నాయకులకు రాహుల్ గాంధీ చెప్పగా.. కేవలం కొన్ని వేల మంది మాత్రమే వచ్చారని సీఎం అన్నారు. బస్సులన్నీ ఖాళీగా వచ్చాయని ఎద్దేవా చేశారు.
Advertisement