
ఉన్నతస్థానాల్లో ఉండి అలా మాట్లాడతారా?
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరమంటూ వెలువరించిన తీర్పుపై కొందరు కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పు పట్టింది. వారి వ్యాఖ్యలు సమర్థనీయం కావని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించింది. స్వలింగ సంపర్కంపై సుప్రీం తీర్పును తప్పుపట్టే విధంగా మాట్లాడిన కేంద్ర మంత్రులపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం(పిల్)పై శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం, జస్టిస్ రంజన్ గొగోయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్‌తోపాటు పలువురు మంత్రులు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ‘‘ఉన్నతమైన స్థానాల్లో ఉండి వారు ఇలా మాట్లాడడం సమర్థనీయం కాదు.
వారికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. మున్ముందు ఇలా మాట్లాడేముందు జాగ్రత్తగా ఉండాలి’’ అని బెంచ్ పేర్కొంది. చిదంబరం మాటలు అంత అభ్యంతరకరంగా లేకపోయినా మిగ తా మంత్రుల వ్యాఖ్యలు సరికాదంది. అయితే వారిపై చర్యలకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.