న్యూఢిల్లీ: చైనా చెబుతున్నట్లు ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య కేవలం 82 వేలు కాదని, అది అంతకు 8 రెట్లు ఎక్కువని వెల్లడైంది. ఫిబ్రవరి మొదటి నుంచి ఏప్రిల్ చివరి వరకు సుమారు 6.40 లక్షల మంది చైనాలో కరోనా బారిన పడ్డారని తేలింది. చైనా మిలటరీకి చెందిన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ నుంచి లీక్ అయిన సమాచారం మేరకు ‘ఫారిన్ పాలసీ మేగజీన్’, వాషింగ్టన్‌కు చెందిన ‘100 రిపోర్టర్స్’ఒక కథనాన్ని ప్రచురించాయి.
ఆసుపత్రులు, అపార్ట్‌మెంట్స్ సహా చైనా వ్యాప్తంగా, సుమారు 230 నగరాల వారీగా అన్ని ప్రాంతాల్లో కేసుల విస్తృతికి సంబంధించిన పూర్తి వివరాలను టేబుల్ రూపంలో తమకు అందాయని అవి పేర్కొన్నాయి. భౌగోళికంగా, ఏ ప్రాంతంలో, ఏ సమయంలో ఎన్ని కేసులున్నాయనే విషయాన్ని ఆ కథనంలో సమగ్రంగా వివరించారు. కరోనా వైరస్‌ను మొదట గుర్తించిన హుబయి రాష్ట్రం, వుహాన్ ప్రాంతాల్లో కోలుకున్నవారి వివరాలను కూడా ఇందులో పొందుపర్చారు. పూర్తి వివరాలను భద్రత కారణాల రీత్యా ప్రజా బాహుళ్యానికి అందుబాటులో ఉంచడం లేదని, అయితే, వైరస్ వ్యాప్తిపై పరిశోధనలు చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు అందజేసే దిశగా ప్రయత్నిస్తున్నామని ‘ఫారిన్ పాలసీ మేగజీన్’, ‘100 రిపోర్టర్స్’ ప్రకటించాయి.
దీనిపై చైనా స్పందించలేదు. కానీ, ‘కరోనా విషయంలో విదేశీ మీడియా చైనాపై వివక్షాపూరితంగా వ్యవహరిస్తోంది’ అని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వివరాలు పూర్తిస్థాయిలో నిజమా? కాదా? అనే విషయాలను పరిశీలించాల్సి ఉందని పలువురు స్వతంత్ర పరిశోధకులు పేర్కొన్నారు. ‘ఫారిన్ పాలసీ ఈ విషయాన్ని బయటపెట్టడం మంచిదే. అయితే, దీనిపై మరింత శోధన జరగాలి’ అని హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పరిశోధనలు చేస్తున్న డాక్టర్ ఎరిక్ ఫీల్డింగ్ వ్యాఖ్యానించారు. చైనా ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం ఆ దేశంలోని కరోనా కేసుల సంఖ్య 82,919. మరణాల సంఖ్య 4,633గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment