
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై విమర్శల దాడి ఎక్కుపెట్టారు. మోదీది 'లై హార్డ్' ప్రభుత్వం అని అన్నారు. ఈ సందర్భంగా హాలీవుడ్ మూవీ డైహార్డ్ సిరీస్ మాదిరిగా మోదీ కూడా లైహార్డ్ సిరీస్‌ను కొనసాగిస్తున్నారని అన్నారు. మోదీ ఒక 'అబద్ధాల వాస్తుశిల్పి' అన్నారు. చాలా పకడ్బందీగా నిర్మాణాత్మకంగా ఆయన అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.
మోదీ ప్రచారం చేస్తున్నట్లుగా గుజరాత్ మోడల్ అంటూ లేనే లేదని, చెప్పినవన్నీ అబద్ధాలేనని ఆ విషయం గుజరాత్ వెళ్లి చూసేవారందరికీ తెలుస్తుందని తెలిపారు. శనివారం ఉదయం రాహుల్ ట్విట్టర్‌లో 'ఒక వేళ బీజేపీ చిత్ర నిర్మాణ సంస్థగా ఉన్నట్లయితే దానిని అప్పుడు కచ్చితంగా లైహార్డ్ అని పిలవాలి' అంటూ ట్వీట్ చేశారు. ఇక 2జీ స్కాం తీర్పును ఉటంకిస్తూ ' ఇప్పుడు మీకు 2జీ గురించి పూర్తి నిజం తెలుసు. నిజం ఇప్పుడు మీ ముందు ఉంది' ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment