వాతావరణం వేడెక్కుతోంది.. ఏటికేడాదీ గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. పట్టణాల కాంక్రీట్ జనారణ్యంలో పరిస్థితి మరీ అధ్వానంగా మారుతోంది. ఇంటికంటే ఏసీలున్న ఆఫీసే వేసవి ‘విడిది’గా మారిపోతున్న పరిస్థితి వస్తోంది. ఇలాంటి సమయంలో సామాన్యుల పరిస్థితి మరింత దారుణం కదా! కానీ శాస్త్రవేత్తలు మాత్రం చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇంట్లో అయినా చల్లదనాన్ని పొందవచ్చని చెబుతున్నారు. వేసవికి ముందే.. ఇళ్ల పైకప్పుపై సున్నం లేదా తెలుపు రంగు వేయిస్తే చల్లగా ఉంటుందని అంటున్నారు.
పైకప్పులపై తెల్లటి సున్నపు పూత పూస్తే ఇల్లు ఎలా చల్లబడుతుంది? చాలా సింపుల్.. సూర్య కిరణాల రూపంలో ఇంటి పైకప్పులను తాకే వేడిని తెలుపురంగు 80 శాతం వరకు పరావర్తనం చెందిస్తుంది. అంటే పైకప్పు వేడవడం తగ్గుతుంది. దానివల్ల ఇంట్లోకి ప్రవేశించే వేడి తగ్గి.. చల్లగా ఉంటుంది. పెద్ద పెద్ద భవనాలపై.. ఆ మాటకొస్తే దేశం మొత్తమ్మీద దీనిని అనుసరిస్తే.. నగరాల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ తగ్గుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
దీనివల్ల ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వంటి వాటి వినియోగం తగ్గి విద్యుత్ బిల్లుల మోత గణనీయంగా తగ్గుతుందని... ఈ మొత్తం పదేళ్లలో కొన్ని వందల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని హైదరాబాద్‌లోని ఐఐటీ, అమెరికాకు చెందిన లారెన్స్ లివర్‌మూర్ నేషనల్ లేబొరేటరీలు ఇప్పటికే తేల్చిచెప్పాయి! దేశంలో ఏటా 700 గిగావాట్ల వరకు విద్యుత్‌ను ఆదా చేసుకోవచ్చని పేర్కొంటున్నాయి. పైకప్పులకు సున్నం, తెల్ల రంగు వేయడమే కాదు.. వినైల్ ప్లాస్టిక్ కూడా వేడిని అడ్డుకోవడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
వినైల్ ప్లాస్టిక్‌తోనూ చల్లదనం
మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కూల్ రూఫ్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. అమెరికాలోని న్యూయార్క్‌లో పైకప్పులను తెల్లగా మార్చే పని యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది. కొన్నేళ్ల క్రితం దక్షిణ అమెరికాలోని పెరూలో కొండ ప్రాంతాల్లోని భారీ పరిమాణంలోని రాళ్లకు తెల్లరంగు వేశారు. మన దేశంలోనూ ఇప్పటికే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూల్ రూఫింగ్ టెక్నాలజీని అమలు చేస్తున్నారు.
మన రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలోనూ నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ అనే సంస్థ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అస్కీ) వంటి సంస్థలతో కలసి ఇటీవల ఓ పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసింది. డ్యూపాంట్ కంపెనీ సరఫరా చేసిన ప్రత్యేమైన ప్లాస్టిక్ షీట్లను నిరుపేదలు నివసించే 25 ఇళ్లపైకప్పులపై బిగించి పరిశీలించింది. ఆ ఇళ్ల లోపలి ఉష్ణోగ్రతలను పరిశీలించినప్పుడు రెండు డిగ్రీల వరకూ తక్కువగా ఉన్నట్టు నిర్ధారించారు.
ఈ ప్లాస్టిక్ షీట్లు మాత్రమే కాదు.. హోర్డింగుల్లో వాడే వినైల్ తెరలను రీసైకిల్ చేసి పేదల ఇళ్లను చల్లగా ఉంచేందుకు వినియోగించవచ్చని ఎన్‌ఆర్‌డీసీ ప్రతినిధి అమర్త్య అవస్తి తెలిపారు. త్వరలోనే దీనిని విస్తృత స్థాయిలో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. వినైల్ తెరలను కొంచెం ఖాళీతో రెండు పొరలుగా వేసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు.
ప్రభుత్వాలూ కల్పించుకుంటే మేలు
కూల్ రూఫ్ టెక్నాలజీ వాడకం విస్తృతమైతే వేసవిలో విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడం ప్రభుత్వాలకు కొంతవరకూ సులువు అవుతుంది. అందువల్ల దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం. భవన నిర్మాణానికి సంబంధించిన నిబంధనల్లో కూల్ రూఫింగ్ టెక్నాలజీని చేర్చడం ద్వారా అటు విద్యుత్‌ను సమర్థంగా వాడుకోవడమే కాకుండా పేద, మధ్య తరగతి ప్రజలను పలు ఆరోగ్య సమస్యల నుంచి కాపాడేందుకూ వీలు కలుగుతుంది.
అయితే కూల్ రూఫింగ్ వల్ల వ్యక్తిగతంగా విద్యుత్ బిల్లులలో తగ్గుదల చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండకపోవడం వల్ల జనంలో ఆసక్తి తక్కువగా ఉండే అవకాశముంది. ప్రభుత్వ కార్యాలయాలు, కొన్ని ప్రైవేట్ సంస్థలు (విస్తీర్ణం ఆధారంగా) నిర్బంధంగా కూల్‌రూఫ్ టెక్నాలజీని వాడేలా చేస్తే కొంత ప్రయోజనం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment