శని శింగనాపూర్ ఆలయం వద్ద ఉద్రిక్తత
ముంబయి : మహారాష్ట్రలోని శని శింగనాపూర్ ఆలయంలో ఉద్రిక్తత నెలకొంది. హైకోర్టు ఆదేశాలతో ఆలయంలోకి ప్రవేశించేందుకు తరలివచ్చిన 'భూమాత’ మహిళా సంఘం చీఫ్ తృప్తి దేశాయ్‌తో పాటు మహిళలను శనివారం అడ్డుకున్నారు. ఆలయంలోకి ప్రవేశించరాదంటూ వారిని స్థానికులతో పాటు ఎన్సీపీ కార్యకర్తలు, ఆలయ ట్రస్ట్ సిబ్బంది అడ్డు చెప్పారు. ఈ సందర్భంగా అక్కడ ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు.
ఆలయంలోకి ప్రవేశించనివ్వకపోవటంపై తృప్తి దేశాయ్ మాట్లాడుతూ ... కోర్టు అనుమతి ఇచ్చినా తమను లోనికి ప్రవేశించకుండా అడ్డుకోవటం దారుణమన్నారు. తాము వెనకడుగు వేసేది లేదని ఆమె తెలిపారు. మరోవైపు తృప్తి దేశాయ్కి వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా... తాము మహిళలను ఆలయంలోకి అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.
కాగా మహారాష్ట్రలో ఆలయాల్లోకి మహిళలను అనుమతించకపోవడం ఇకపై కుదరదు. పూజా స్థలాల్లోకి వెళ్లడం అందరి ప్రాథమిక హక్కు అని, దాన్ని ప్రభుత్వం పరిరక్షించాలని హైకోర్టు పేర్కొంది. శతాబ్దాల నుంచి ఉన్న సంప్రదాయానికి చరమగీతం పాడుతూ, లింగ వివక్షకు పుల్‌స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. శని శింగనాపూర్ లాంటి ఆలయ గర్భగుడిలోకి మహిళలను అనుమతించకపోవడాన్ని చేసిన పిల్‌ను పరిష్కరిస్తూ తీర్పు చెప్పింది. ఆలయంలోకి రాకుండా అడ్డుకుంటే వారికి 6 నెలల శిక్ష విధించేలా చట్టం ఉంది.