
న్యూఢిల్లీ : విపక్షాల నిరసనలు, నినాదాలతో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం దద్దరిల్లాయి. దీంతో లోక్‌సభ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడగా, రాజ్యసభ మధ్యాహ్ననికి వాయిదా పడింది. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం, ఏపీకి ప్రత్యేక హోదా, రిజర్వేషన్ల అంశంపై చర్చకు సభ్యులు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సమావేశాలను కొద్దిసేపు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి.
మరోవైపు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏపీకి ప్రత్యేక హోదా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై సభ్యులు ఆందోళనకు దిగారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభ్యులను వారించినా ఫలితం లేకపోవడంతో సభను మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేశారు.