పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇవాళ కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మూడోరోజు సమావేశాలు ప్రారంభం అయిన కొద్ది నిమిషాల్లోనే లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడింది.
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇవాళ కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మూడోరోజు సమావేశాలు ప్రారంభం అయిన కొద్ది నిమిషాల్లోనే లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడింది. విపక్ష సభ్యుల నిరసనలు, నినాదాలు, ఆందోళనల మధ్య గురువారం ఉదయం లోక్ సభ మొదలైంది. సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు.
దాంతో ప్రశ్నోత్తరాల సమయం రద్దు చేసి వ్యాపం, లలిత్ మోదీ కుంభకోణాలపై చర్చించాలంటూ కాంగ్రెస్, వామపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. చర్చకు స్పీకర్ అంగీకరించకపోవటంతో సభ్యులు నిరసనకు దిగారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దాంతో ఆమె సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు.
మరోవైపు రాజ్యసభలోనూ గందరగోళం కొనసాగుతోంది. వ్యాపం, మోదీ స్కామ్పై చర్చించాల్సిందేనంటూ విపక్ష సభ్యులు పట్టుబట్టారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేపట్టారు. వైస్ ఛైర్మన్ కురియన్ ...విపక్ష సభ్యులకు సర్దిచెప్పి సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.