
పేదరికం నుంచి గట్టెక్కించాం: రాహుల్ గాంధీ
గత పదేళ్ల యూపీఏ పాలనలో సుమారు 15 కోట్ల మంది జీవితాల నుంచి పేదరికాన్ని పారదోలామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు.
15 కోట్ల మందికి విముక్తి యూపీఏ పాలనపై రాహుల్
టోంక్ (రాజస్థాన్): గత పదేళ్ల యూపీఏ పాలనలో సుమారు 15 కోట్ల మంది జీవితాల నుంచి పేదరికాన్ని పారదోలామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. అదే సమయంలో తమ పాలనలో దారిద్య్రరేఖకు ఎగువన, మధ్యతరగతికి దిగువన 70 కోట్ల జనాభాతో కొత్త వర్గాన్ని సృష్టించామన్నారు. ఇందులో సెక్యూరిటీ గార్డులు, ట్యాక్సీ డ్రైవర్ల వంటి వారు ఉన్నారన్నారు. వారిని మధ్యతరగతికి చేర్చేందుకు తమ పార్టీ రాజకీయాలు చేస్తుందని చెప్పుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో ఉన్న దేవ్‌లీ ప్రాంతంలో జరిగిన బహిరంగసభలో రాహుల్ ప్రసంగించారు.
‘‘ప్రజలను సాధికారులను చేసేందుకు, పేదరికం నుంచి ప్రజలను బయటకు తెచ్చేందుకు, వారికి విద్య, ఉపాధి, గౌరవం, హక్కులు కల్పించేందుకు మేం రాజకీయాలు చేస్తాం. కాంగ్రెస్ ఎప్పటికీ పేదలను మరచిపోదు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. అవినీతి గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్‌లలో జరిగిన అవినీతిని ఎందుకు చూడలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడ్డాక రాజస్థాన్‌లో తొలిసారి పర్యటిస్తున్న రాహుల్ ఈ సభలో కేవలం ఆరు నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు.