కన్నబిడ్డలేనా..? తండ్రులు డిఎన్‌ఏ టెస్ట్..
పుణె నగరంలో తండ్రులు పిల్లలు తమ కన్నబిడ్డలేనా అని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ సైన్సు లేబొరేటరీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బిడ్డలు తమ సొంతవారా కాదా? అనే అనుమానంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు వచ్చే తల్లిదండ్రుల సంఖ్య 2014లో 37గా ఉండగా.. 2015లో 197కు చేరింది. గతేడాది 321 మంది డిఎన్‌ఏ పరీక్షలు చేయించుకున్నట్లు పుణె ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ కృష్ణకాంత్ కులకర్ణి చెప్పారు.
2014 నుంచి డిఎన్‌ఏ పరీక్షలు చేసే సదుపాయాన్ని ల్యాబ్‌లో కల్పించినట్లు తెలిపారు. అప్పటి నుంచి వందల సంఖ్యలో జంటలు డిఎన్‌ఏ పరీక్షల కోసం వస్తున్నట్లు వెల్లడించారు. అంతకుముందు ఈ కేసులు ముంబైలో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు వెళ్లేవని తెలిపారు. అందుకే పుణె నుంచి డిఎన్‌ఏ పరీక్షలకు వెళ్తున్న వారి సంఖ్యను గుర్తించలేకపోయామని చెప్పారు. ముంబై ల్యాబ్‌లో ఎక్కువ మంది డిఎన్‌ఏ పరీక్షలకు వస్తుండటంతో పుణెలో కూడా ఆ సదుపాయాన్ని ప్రారంభించారని తెలిపారు.
గత మూడేళ్లలో డిఎన్‌ఏ పరీక్షలు చేయించుకోవడానికి వస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని వివరించారు. ముఖ్యంగా పిల్లలు కన్నబిడ్డలేనా? అని తెలుసుకోవడానికి ఎక్కువ మంది వస్తున్నారని చెప్పారు. క్రిమినల్, హత్య కేసుల ఒత్తిడి విపరీతంగా ఉండగా.. అందుకు తోడుగా పెటర్నిటీ టెస్టు కోసం వస్తున్నవారి సంఖ్య పెరగడంతో తలకు మించిన భారంగా మారుతోందని తెలిపారు.
పెటర్నిటీ టెస్టుల కోసం వస్తున్న జంటల్లో సంపన్న కుటుంబాలే ఎక్కువగా ఉంటున్నాయని అధికారులు తెలిపారు. జంటల్లో ఒకరిపై మరొకరికి నమ్మకం లేకపోవడమే వారిని ల్యాబ్‌ల వద్దకు తీసుకువస్తోందని అన్నారు. టెస్టుకు భారీగా ఖర్చు అవుతుందని చెప్పారు. పిల్లల డిఎన్‌ఏ తల్లి డిఎన్‌ఏతో మ్యాచ్ అయితే.. అనుమానం నివృత్తి చేసుకోవడానికి తండ్రి కూడా టెస్టు చేయించుకుంటున్నారని తెలిపారు. ఆస్తి వివాదాల మీద కూడా కొన్ని జంటలు పెటర్నిటీ టెస్టు చేయించుకుంటున్నట్లు వెల్లడించారు.