
స్వామి ఆంజనేయ.. కోర్టుకు హాజరుకండి!
హిందూ దేవుడు ఆంజనేయస్వామిని కోర్టుకు హాజరుకావాలంటూ బిహార్‌లోని ఓ దిగువ న్యాయస్థానం నోటీసులు జారీచేసింది.
పట్నా: హిందూ దేవుడు ఆంజనేయస్వామిని కోర్టుకు హాజరుకావాలంటూ బిహార్‌లోని ఓ దిగువ న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. రోహ్తస్ జిల్లాలోని ఓ ఆంజనేయస్వామి ఆలయం విషయమై ప్రజా పనుల విభాగం కోర్టును ఆశ్రయించడంతో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.
రోహ్తస్ జిల్లాలోని డెహ్రీ ఆన్ సోన్‌లో రోడ్డుపక్కన ఉన్న 'పంచముఖి' హనుమాన్ ఆలయం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నదని, ఈ ఆలయం రోడ్డును ఆక్రమించుకొని ఉన్నదని ప్రజాపనుల విభాగం అధికారులు కోర్టులో కేసు దాఖలు చేశారు. హనుమాన్ ఆలయం తొలగించడంలో కోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. దీంతో ఆంజనేయస్వామి కోర్టకు హాజరుకావాలంటూ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు కోర్టు జారీచేసిన నోటీసులను ఆలయానికి అధికారులు అతికించారు. అయితే కోర్టు నోటీసులను స్థానిక బజరంగ్ దళ్, బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఆలయం తొలగించాలన్న అధికారుల ప్రయత్నాన్ని వారు అడ్డుకుంటున్నారు. బెగుసరై జిల్లాలోనూ రోడ్డుపక్కన ఉన్న హనుమాన్ ఆలయం తొలగించే విషయంలో అధికారులకు, స్థానిక బజరంగ్ దళ్ శ్రేణులకు గతంలో ఘర్షణ జరిగింది. దీంతో ఈ ఆలోచనను అధికారులు మానుకున్నారు.
ఇక ఈ నెల 1న బిహార్ సీతామర్హి జిల్లాలో శ్రీరాముడు, ఆయన సోదరుడు లక్ష్మణుడిపై ఓ వ్యక్తి కోర్టులో కేసు వేయగా.. తర్కవిరుద్ధంగా ఉన్న ఈ కేసు కోర్టులో నిలబడజాలదంటూ న్యాయమూర్తి కొట్టివేశారు.