ప్రతీకాత్మక చిత్రం
లక్నో : చట్టాన్ని మీరిన వారి పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటుగా.. నిబంధనలు పాటించే పౌరులను గౌరవించడం కూడా తెలుసని నిరూపించేందుకు లక్నో ట్రాఫిక్ పోలీసులు రోజా పూలతో ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, హెల్మెట్ ధరించిన వారిని అభినందిస్తూ గులాబి పువ్వు ఇచ్చారు. కానీ ఆ మంచి పని కూడా ఓ జంట కాపురంలో విభేదాలను సృష్టిస్తుందని వారు ఊహించలేదు. కాకపోతే ఫొటో సాయంతో ఆ విభేదాలు కాస్త ముగిసిపోవడంతో కథ సుఖాంతమైంది.
అసలేం జరిగిందంటే... లక్నోకు చెందిన ఓ యువకుడు హెల్మెట్ ధరించి వెళ్తుండటంతో సికిందర్‌బాగ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అతడికి ఎర్ర గులాబి ఇచ్చి అభినందించారు పోలీసులు. ఇంటికి వెళ్లిన తర్వాత అతడి బైక్‌ను తుడుస్తున్న క్రమంలో పువ్వును చూసిన ఆ వ్యక్తి భార్య కంగుతింది. గులాబీ పువ్వు పట్టుకుని తిరగాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఆ పువ్వు ఎవరు ఇచ్చారని నిలదీయడంతో పాటుగా.. తన భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని భావించి బోరున విలపించింది.
ట్రాఫిక్ పోలీసులే పువ్వు ఇచ్చారని చెప్పినా నమ్మలేదు సరికదా ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్తానని బెదిరించింది. తాను ఏ తప్పు చేయలేదని ఎంతగా మొత్తుకున్నా భార్య వినకపోవడంతో.. ఆ యువకుడు వెంటనే పోలీసుల దగ్గరకు పరుగెత్తాడు. తన సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకున్నాడు. రోజా పూల కార్యక్రమం నాటి ఫొటో ఇవ్వాల్సిందిగా కోరాడు. చాలా సేపు వెదికిన తర్వాత ట్రాఫిక్ ఎస్సై ఫోన్‌లో అతడి ఫొటో దొరకడంతో ఊపిరి పీల్చుకున్నాడు. తన ఫొటోతో పాటుగా ఆ రోజు ఎర్ర గులాబీలు అందుకున్న మరికొంత మంది ఫొటోలు కూడా తీసుకెళ్లి భార్యకు చూపించడంతో కథ సుఖాంతమైంది.
రోజాకు బదులు.. క్యాలీఫ్లవర్
ఈ సరదా సంఘటనను ట్రాఫిక్ ఎస్సై ప్రేమ్ శంకర్ షాహి తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ఇప్పటి నుంచి రోజా పూలకు బదులు కాలీఫ్లవర్ ఇవ్వండని’ ఓ పోలీస్ అధికారి ట్వీట్ చేయగా... ‘సర్ క్యాలీఫ్లవర్ ఇచ్చినా కూడా నా ప్రియతమ ధర్మపత్ని నమ్మదు. కాబట్టి దాంతో పాటుగా ఓ సర్టిఫికెట్ కూడా అందిస్తే బాగుంటుందని’ నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు. మరికొంత మంది మాత్రం లక్నో ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ట్వీట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment