
సాక్షి, నాగపూర్: మూకదాడులు దేశంలో ఏ మాత్రం సరైనవి కావని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. భారతదేశం భారతీయులందరిదీనని, ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పారు. దసరా సందర్భంగా మంగళవారం నాగపూర్‌లో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన కార్యక్రమంలో భగవత్ పాల్గొని ఆయుధపూజ నిర్వహించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, భిన్నత్వం అనేది మన దేశానికి అంతర్గత శక్తి అని అన్నారు. ‘మూకదాడులు, సామాజిక హింసా ఘటనల వల్ల దేశానికి, హిందూ సమాజం ప్రతిష్టకు భంగం వాటిల్లుతుంది. కొన్ని మతాల మధ్య భయాందోళనలకు దారితీస్తుంది. మూకదాడులు భారత సంస్కృతి కాదు, పరాయి సంస్కృతి' అని భగవత్ అన్నారు. పరస్పర సహకారం, కలిసి చర్చించుకునే వాతావరణాన్ని పాదుకొలిపేందుకు సంఘ్ స్వయంసేవక్‌లు కృషిచేయాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు.