కేంద్ర సమాచార కమిషనర్‌గా ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ నియమితులయ్యారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సాక్షి, న్యూఢిల్లీ/హన్మకొండ: కేంద్ర సమాచార కమిషనర్‌గా ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ నియమితులయ్యారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కమిషనర్ పదవి రావడం చాలా సంతోషాన్నిచ్చిందని, బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తానని చెప్పారు. అందరికీ సమాచారం అందేలా కృషి చేస్తానన్నారు. ఇతర దేశాల్లోని సమాచార హక్కు చట్టం కన్నా మన చట్టం చాలా మెరుగైందని చెప్పారు. ఈ చట్టం వినియోగంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామని, దీనికి మీడియా కూడా సాయం చేయాలని కోరారు. నల్సార్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడైన ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ న్యాయ సంబంధ అంశాలపై పలు రచనలు చేశారు.
మాడభూషి నేపథ్యం...
కేంద్ర సమాచార కమిషనర్‌గా నియమితులైన మాడభూషి శ్రీధర్ ప్రస్తుతం నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ రీసెర్చ్(నల్సార్) వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన నల్సార్ రిజిస్ట్రార్ తదితర హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు. ఆయన పూర్వీకులు వరంగల్‌లోని గిర్మాజీపేటలో స్థిర పడ్డారు. మాడభూషి తండ్రి శ్రీనివాసాచార్య జనధర్మ, వరంగల్‌వాణి పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించారు. ఆయనకు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు తదితరులతో బాగా పరిచయం ఉంది. మాడభూషి విద్యాభ్యాసం వరంగల్‌లోని మసూంఅలీ ప్రభుత్వ పాఠశాల, ఏవీవీ జూనియర్ కాలేజీలో సాగింది.
తర్వాత చంద్రకాంతయ్య మెమోరియల్ కాలేజీలో బీఎస్సీ (బీజడ్‌సీ) చదివారు. అప్పుడు ప్రిన్సిపాల్‌గా ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ ప్రోత్సాహంతో మిత్రులతో కలసి కళాశాల పత్రిక నడిపారు. కొంతకాలం విలేకరిగా పనిచేశారు. తర్వాత హన్మకొండలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలో ఎల్‌ఎల్‌బీ అభ్యసించి బంగారు పతకం సాధించారు. ఆపై ఉస్మానియా యూనివర్సీటీలో ఎల్‌ఎల్‌ఎం చదివారు. బీసీజే, ఎంసీజే పట్టాలు పొందారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోనే కొంతకాలం న్యాయవాద వృత్తిలో శ్రీధర్ కొనసాగారు. 1990లో నల్సార్ వర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా చేరారు. వివిధ అంశాలపై 26 పుస్తకాలు, 100 వరకు పరిశోధన వ్యాసాలు రాశారు.