జవాను సమాచారంతోనే.. పుల్వామా దాడి | Madhya Pradesh ATS arrests Avinash Kumar | Sakshi
Sakshi News home page

జవాను సమాచారంతోనే.. పుల్వామా దాడి

Published Fri, May 17 2019 1:41 PM | Last Updated on Fri, May 17 2019 1:55 PM

Madhya Pradesh ATS arrests Avinash Kumar - Sakshi

భోపాల్‌ : హానీ ట్రాప్‌లో చిక్కిన ఓ భారతసైనికుడు సీఆర్‌పీఎఫ్ కదలికల సమాచారం అందించి పుల్వామా దాడికి కారణమయ్యాడని మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌(ఏటీఎస్‌), కేంద్ర నిఘా సంస్థల దర్యాప్తులో తేలింది. సామాజిక మాధ్యమాల్లో పాక్ ఐఎస్ఐ వేసిన ఉచ్చులో భారత సైనికుడు అవినాష్ కుమార్ (25) చిక్కుకున్నాడు. స్నూఫింగ్ యాప్‌ ద్వారా ఓ అమ్మాయిలా మాట్లాడినట్టు జవానును మభ్యపెట్టి కీలక సమాచారాన్ని తెలుసుకున్నారని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాల దర్యాప్తులో తెలిసింది. సీఆర్పీఎఫ్ బలగాల కదలికల సమాచారం అవినాష్ ఎప్ప‌టిక‌ప్పుడు అందజేశాడని, దీనివల్లే పుల్వామాలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేయించి 40మందిని హతమార్చారని వెల్లడైంది. మన సైనిక బలగాల సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేర‌వేసిన‌ అవినాష్ కుమార్‌ను మధ్యప్రదేశ్ ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు. 

ఇండోర్ సమీపంలోని మోహో పట్టణంలోని బీహార్ రెజిమెంట్‌లో క్లర్క్‌గా అవినాష్ కుమార్ పనిచేశారు. 2018లో ఇతన్ని అసోంకు బదిలీ చేశారు. అవినాష్ తండ్రి కూడా ఆర్మీ జవానే. అవినాష్ బ్యాంకు ఖాతాలో పాకిస్థాన్ నుంచి రూ.50 వేలు డిపాజిట్ కూడా చేశారని తెలుస్తోంది. అయితే అమ్మాయితో సెక్స్ ఛాట్ చేయడంతో పాటు డబ్బుకు కక్కుర్తి పడి భారత సైనిక రహస్యాలను పాక్ ఐఎస్ఐకు అందించాడా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అవినాష్ కుమార్‌ను అరెస్టు చేసి భోపాల్‌లోని స్పెషల్ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా అతన్ని రిమాండుకు తరలించారు. అవినాష్ ఇంట్లో పోలీసులు తనిఖీలు కొనసాగిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement