భోపాల్: దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ 4.0 రేపటి(ఆదివారం)తో ముగుస్తుండగా మధ్యప్రదేశ్ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కట్టడి చేయటంలో భాగంగా తమ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్లు సీఎం శివరాజ్‌సింగ్ చౌవాన్ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో జూన్ 15 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. పొడగించిన లాక్‌డౌన్‌తో జూన్ 13 నుంచి స్కూల్స్ పున:ప్రారంభిస్తామన్న విషయంలో మరికొన్ని రోజుల తర్వాత ప్రభుత్వ నిర్ణయం వెల్లడిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని దాదాపు 66. 27 లక్షల మంది విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోకి 145.92 కోట్లను బదిలీ చేసినట్లు పేర్కొన్నారు.
లాక్‌డౌన్ కారణంగా స్కూల్స్ మూసి ఉండటం వల్ల ఈ డబ్బును మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నేరుగా బదిలీ చేసినట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్రం కంటైన్‌మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే. అయితే కంటైన్‌మెంట్ జోన్లలో తప్ప మీగతా ప్రాంతాల్లో దశల వారిగా అన్ని కార్యకలాపాలకు సడలింపులు ఇచ్చింది. ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌లో 7,645 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 334 మంది మృతి చెందారు. ఇక కరోనా నుంచి 4,269 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment