నీట్ ఫలితాల వెల్లడిపై స్టే
► మధ్యంతర ఉత్తర్వులిచ్చిన మద్రాసు హైకోర్టు బెంచ్
► జూన్ ఏడులోపు వివరణకు ఆదేశం
సాక్షి, చెన్నై/మదురై: వైద్య విద్య కోర్సుల్లో 2017 ఏడాదికి ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘నీట్’ పరీక్ష ఫలితాల వెల్లడి నిలుపుదల చేస్తూ మద్రాసు హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఉత్తర్వులపై కౌంటర్ అఫిడవిట్‌ను జూన్ 7వ తేదీలోగా దాఖలు చేయాల్సిందిగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ), సీబీఎస్‌ఈ డైరెక్టర్, కేంద్ర ఆరోగ్యశాఖలను హైకోర్టు మదురై బెంచ్ ఆదేశించింది. ఈనెల 7న నిర్వహించిన నీట్ పరీక్షా ప్రశ్నా పత్రాల్లోని గందరగోళాన్ని వెలుగులోకి తెస్తూ కొందరు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా తిరుచ్చికి చెందిన శక్తి మలర్ పిటిషన్ వేశారు.
ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసిన వారికి ప్రశ్నాపత్రాలు సులభంగా ఇచ్చారని, ఇంగ్లిష్‌లో రాసిన వారు ఇబ్బందులుపడ్డారని, కొత్తగా మళ్లీ పరీక్ష నిర్వహించాలని శక్తి మలర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్లను జస్టిస్ ఎంవీ మురళీధరన్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఉమ్మడి ప్రవేశ పరీక్ష అనేది అన్ని భాషల్లోనూ ఒకేలా ఉండాలంటూ కోర్టు కేసును జూన్ 7కు వాయి దా వేసింది. కాగా, గుజరాత్ ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని, పరీక్ష మళ్లీ నిర్వహించాలనిగుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
పీజీ కోర్సుల కటాఫ్ తగ్గింపు: నీట్ పరీక్ష ద్వారా పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కటాఫ్‌ను 7.5 పర్సంటైల్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ప్రకటించింది. కటాఫ్ తగ్గించకపోతే సీట్లకు సరిపడా అభ్యర్థులు ఎంపికకాలేరని వేర్వేరు రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో జనరల్ కేటగిరీకి కటాఫ్ 42.5, రిజర్వ్‌డ్ కేటగిరీకి 32.5 పర్సంటైల్‌కు తగ్గింది.