గాల్లోంచి వస్తువులను సృష్టించడం.. కళ్ల ముందే దేనినైనా మాయం చేయడం.. మనిషి తల, శరీరాన్ని ముక్కలుగా చేసి తిరిగి అతికించడం.. ఇదంతా ఇంద్రజాలం (మ్యాజిక్) మహిమ. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో, ఎంతో మంది ఇంద్రజాలికులు ప్రదర్శించే ట్రిక్కులన్నింటినీ ఒకే చోట చూడగలిగితే.. బాగుంటుంది కదూ! ఈ అవకాశం మన దేశంలోనే తొలిసారిగా కేరళ రాజధాని తిరువనంతపురంలో అందుబాటులోకి రానుంది. ‘మ్యాజిక్ ప్లానెట్’ పేరిట అకాడమీ ఆఫ్ మ్యాజికల్ సెన్సైస్ దీనిని ఏర్పాటు చేయనుంది. 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ ‘మ్యాజిక్ ప్లానెట్’ను ప్రపంచ ఇంద్రజాల దినోత్సవమైన అక్టోబర్ 31న ప్రారంభిస్తారు. దీని మస్కట్ ‘హారీ’ని, యానిమేటెడ్ సినిమాను 10న విడుదల చేయనున్నామని మ్యాజిక్ అకాడమీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గోపీనాథ్ ముతుకాడ్ వెల్లడించారు. ‘మ్యాజిక్ ప్లానెట్’లో క్రీస్తుపూర్వం 5 వేల ఏళ్లనాటి నుంచి ఇంద్రజాలానికి చెందిన అంశాలతో కూడిన మ్యూజియం, వర్చువల్ సూపర్‌మార్కెట్, షేక్‌స్పియర్ ‘ది టెంపెస్ట్’ ఆధారంగా ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా ఉంటాయన్నారు.