
రాందేవ్ బాబాకు 600 ఎకరాలు, దుమారం
యెగాగురు బాబా రాందేవ్ కు మహారాష్ట్ర ప్రభుత్వం 600 ఎకరాల భూమిని ధారాదత్తం చేసింది.
ముంబై: యెగాగురు బాబా రాందేవ్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం 600 ఎకరాల భూమిని ధారాదత్తం చేసింది. రాందేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న 'పతంజలి యోగపీఠ్ ' సంస్థకు ఈ స్థలాన్ని కేటాయించింది. ఆయుర్వేద మందుల తయారీకి పయోగించే ఔషధ మొక్కల పెంపకానికి అవసరమైన ప్రాసెసింగ్ ప్లాంట్ కోసం ఈ భూమిని వినియోగించనున్నారు.
నాగ్పూర్ ఎంపీ, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్రమంత్రి చంద్రశేఖర్, యోగపీఠ్ ప్రతినిధులు సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. నాగపూర్ జిల్లా కోటాల్ లో 200, ప్రాసెసింగ్ ప్లాంట్ కోసం మిహాన్ సెజ్లో మరో 450 ఎకరాల భూమిని రాందేవ్ బాబాకు అప్పగించారు.
ప్రకృతి వనరులు, మందుల వినియోగంపై పరిశోధన కోసం ఈ భూమిని బాబాకు కేటాయించామని కేంద్ర మంత్రి ప్రకటించారు. దీనిద్వారా మావోయిస్టుల ప్రభావిత జిల్లా గడ్చిరోలిలో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయన్నారు. ముఖ్యంగా విదర్భలోని గిరిజన ప్రాంతాలు, రిమోట్ భూభాగాల్లో విస్తారంగా కనిపించే సహజ మందులు, వాటి మూలాలపై పరిశోధనకు ఈ భూమి ఉపయోగిస్తారని తెలిపారు.
అయితే వివాదాస్పద యోగా గురుకు వందల ఎకరాల స్థలాలను కట్టబెట్టడంపై విమర్శలు చెలరేగాయి. భారీ పెట్టుబడులకు ఉద్దేశించిన సెజ్ భూమిని ఇలా బాబాలకు ఇవ్వడమేంటని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వానికి నిజంగా అటవీ ఉత్పత్తులను ప్రోత్సహించే ఉద్దేశముంటే టెండర్లను ఎందుకు పిలవలేదని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. అటవీ భూములను అన్యాక్రాంతం చేయడానికి బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగా ఈ కేటాయింపులు చేశారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ఆరోపించారు.
రాందేవ్ బాబా ఫార్మసీ తయారుచేసిన ఔషధం పుత్రజీవక్ బీజ్‌పై పార్లమెంటులో ఇంతకుముందు దుమారం రేగింది. దీనిపై నిషేధం విధించాలని రాజ్యసభలో విపక్ష సభ్యులు డిమాండ్‌చేసిన సంగతి తెలిసిందే. మరి తాజా పరిణామం పార్లమెంటును ఏమేరకు ప్రభావితం చేయనుందో వేచి చూడాలి.