సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ మే 3తో ముగియనుంది. ఓవైపు లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలవుతున్నా.. పాజిటివ్ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. వైరస్ విరుగుడుకు ఇప్పటి వరకు సరైన ఔషధం లేకపోవడంతో.. సామాజిక దూరం, లాక్‌డౌన్‌తోనే కరోనాను కట్టడి చేయగలమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంక్షలను మరికొన్ని రోజులపాటు పొడిగించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో విధించిన లాక్‌డౌన్ మే 7తో ముగియనుంది. అయితే ఆ తరువాత కూడా పరిస్థితి ఇలానే కొనసాగితే మరికొన్ని రోజుల పాటు ఆంక్షలను కొనసాగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.
లాక్‌డౌన్‌కే మొగ్గు..
ఇక దేశ వ్యాప్తంగా చూస్తే చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ కొనసాగింపుకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ సర్కార్లు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నందున లాక్‌డౌన్ పొడిగింపు వ్యూహాన్నే అమలు చేస్తామని ఢిల్లీ ప్రభుత్వంలోని ఓ అధికారి సోమవారం వెల్లడించారు. దీనికి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం సానుకూలంగా ఉన్నారని, ఎలాంటి సడలింపు ఇచ్చిన అసలుకే మోసం వచ్చే అవకాశం ఉన్నట్లు సీఎం చెప్పారని తెలిపారు. ఈ క్రమంలోనే పలు దుకాణాలకు లాక్‌డౌన్ నుంచి వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం తీసుకున్ని నిర్ణయాన్ని ఢిల్లీ సర్కార్ బాహాటంగానే తప్పుబట్టింది. కాగా ఇప్పటి వరకు ఢిల్లీలో 2,625 కరోనా పాజిటివ్ తేలగా.. 54 మరణాలు సంభవించాయి. (లాక్‌డౌన్ ఎత్తివేస్తే భారీ మూల్యం తప్పదు..!)
మరోవైపు మహారాష్ట్రలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండటంతో లాక్‌డౌన్ తప్ప మరో దారి లేదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. శనివారం నాటికి ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6817గా నమోదు కాగా.. 301మంది మృత్యువాత పడ్డారు. ఒక్కసారిగా లాక్‌డౌన్ ఎత్తేస్తే పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగి వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదే అభిప్రాయాన్ని గుజరాత్, రాజస్తాన్, తమిళనాడుతో పాటు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా వ్యక్తం చేస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన అనంతరం తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆయా ప్రభుత్వాలు చెబుతున్నాయి. మొత్తానికి దేశ వ్యాప్తంగా కూడా లాక్‌డౌన్ మరికొన్ని రోజుల పాటు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ణు ఎత్తివేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment