లాక్‌డౌన్ నేపథ్యంలో చెన్నై నుంచి మధ్యప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు సైకిళ్లపై వెళ్తున్న వలస కూలీలు. ఆదివారం భువనగిరిలో కనిపించిన దృశ్యమిది..
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు తిరిగి తెలంగాణలోకి అడుగుపెట్టడం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రత్యేక అనుమతులు తీసుకొని వేలాది మంది రైళ్లు, బస్సులు, సొంత వాహనాల్లో రాష్ట్రానికి చేరుకుంటున్నారు. ఇలా వచ్చిన వారిలో ఇప్పటిదాకా 11 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారంతా మహారాష్ట్ర నుంచి వచ్చిన వారుగా నిర్ధారించారు. ఆ సంఖ్య ఇంకా పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మున్ముందు రాష్ట్రంలోకి ఎంతమంది వస్తారో, ఎక్కడి నుంచి వైరస్ మోసుకొస్తారోనన్న ఆందోళన వైద్యాధికారులను వెంటాడుతోంది.
మరోవైపు వివిధ దేశాల నుంచి ప్రత్యేక విమానాల్లో రాష్ట్రవాసులు రావడం మొదలైంది. శనివారం కువైట్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న వారందరినీ ప్రత్యేకంగా క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచారు. సడలింపులతో తలెత్తుతున్న ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలన్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆదివారం చర్చించారు. కేంద్ర ప్రభుత్వ వర్గాలతో ఈ అంశంపై సంప్రదింపులు జరుపుతున్నారు. సోమవారం ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో ఇదో ప్రధాన అంశంగా ఉంటుందని వైద్యాధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని పరిస్థితిని వివరించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక నివేదికను తయారు చేసింది. ప్రధానికి నివేదించాల్సిన అంశాలను అందులో ప్రస్తావించినట్లు సమాచారం.
(చదవండి: బర్త్‌డేలో సూపర్ స్ప్రెడ్!)
పటిష్ట కార్యాచరణ...
ఇప్పటివరకు రాష్ట్రంలో మొదటగా విదేశాల నుంచి వచ్చినవారి ద్వారా కరోనా కేసులు వచ్చాయి. ఆ తర్వాత మర్కజ్ ద్వారా వచ్చిన కేసులున్నాయి. ఇప్పుడు తాజాగా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న వ్యక్తుల ద్వారా కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అలాగే విదేశాల్లో ఉన్నవారు కూడా విడతలవారీగా రాష్ట్రంలోకి అడుగుపెడుతున్నారు. లాక్‌డౌన్ వరకు మొత్తం వ్యవస్థ అంతా అధికార యంత్రాంగం చేతిలో ఉంది. కానీ సడలింపులతో పరిస్థితి చేజారిపోతోందన్న ఆందోళన వైద్యాధికారులను వేధిస్తోంది.
(చదవండి: రోజు విడిచి రోజు స్కూలుకు..)
పైగా రాష్ట్రంలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగిలిన చోట్ల కరోనా వ్యాప్తి చాలా వరకు నియంత్రణలో ఉంది. ఇప్పుడు బయటి రాష్ట్రాలు, దేశాల నుంచి రాష్ట్రంలోకి ప్రజలు భారీగా వస్తుండటంతో పరిస్థితి మారనుంది. ఈ నేపథ్యంలో పటిష్ట కార్యాచరణ చేపట్టాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఎలాగైనా సరే బయటి నుంచి వచ్చే వారిని పూర్తిస్థాయిలో సరిహద్దుల్లోనే స్క్రీనింగ్ చేసి పంపాలని నిర్ణయించారు. ఏమాత్రం లక్షణాలున్నా వారిని హోం క్వారంటైన్‌లో ఉంచాలని, ఆ మేరకు వారి చేతిపై ముద్ర వేయాలని నిర్ణయించారు.
కార్యాచరణ ఇలా...
► రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలన్నింటిపైనా పూర్తిస్థాయి నిఘా పెట్టాలి.
► థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలి. కరోనా లక్షణాలున్నా వారిని, వారితో వచ్చిన వ్యక్తులను హోం క్వారంటైన్‌లో ఉంచాలి. తీవ్రత ఎక్కువగా ఉంటే తక్షణమే ఆసుపత్రికి తరలించాలి.
► రాష్ట్రానికి వలస వచ్చిన వారి అడ్రస్, ఫోన్ నంబర్, జిల్లా, మండలం, గ్రామం వంటి వివరాలన్నీ నమోదు చేసుకొని ఆ వివరాలను జిల్లా కలెక్టర్‌కు పంపించాలి. అక్కడి నుంచి ఆరోగ్య కార్యకర్తలకు సమాచారం ఇవ్వాలి. అవసరమైతే వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి.
► క్వారంటైన్‌లో ఉన్నన్ని రోజులూ నిత్యం ఆయా వ్యక్తులకు జ్వరం, ఇతరత్రా వైరస్ లక్షణాలున్నాయేమోనని పరిశీలించాలి. వారు బయటకు వెళ్లనీయకుండా చూడాలి.
► రాష్ట్రానికి తిరిగి వచ్చే వారి కోసం అవసరమైతే వలసల నిర్వహణకు ప్రత్యేక నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
► వైరస్ లక్షణాలున్న వారిని ప్రత్యేకంగా క్వారంటైన్ చేయాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్వారంటైన్ సెంటర్లు లేదా ఆర్థిక స్థోమత ఉంటే సొంత ఖర్చులతో హోటళ్లలో ఉంచొచ్చు.
► వలస వ్యక్తులు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించేలా, మాస్క్ ధరించేలా చూడాలి. గ్రామాల్లో ఇటువంటి విషయాలపై ప్రచారం చేయాలి.
► ఇప్పటివరకు నియంత్రణలో ఉన్న పరిస్థితిని చెదరనీయకుండా వలసదారులపై నిఘా పెట్టాలి. తద్వారా వైరస్ విస్తరించకుండా చూడాలి.
► గ్రామాల్లో ప్రత్యేకంగా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న దానిపైనా చర్చ జరుగుతోంది.
► వలసదారులు సామాజిక బహిష్కరణకు గురికాకుండా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment