మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే బీజేపీ ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికారం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని, హర్యానాలో మాత్రం స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ఎన్నికల పండితులు అంచనా వేశారు. అయితే మహారాష్ట్రలో మాత్రం పరిస్థితి గురించి ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే, ఎన్నికలకు ముందు ఇక్కడ రెండు ప్రధాన కూటములు విడిపోయాయి. బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ.. ఈ నాలుగు ప్రధాన పార్టీలు వేటికవే పోటీ చేశాయి. దాంతో ఓట్లు గణనీయంగా చీలిపోవడం ఖాయం.
ఇంతకుముందు కలిసి ఉండగా అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ - శివసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మరీ అంత తేలిగ్గా మాత్రం లేదు. రెండు రాష్ట్రాల ఎన్నికలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారం సొంతం చేసుకోవాలని గట్టిగా ప్రచారం చేశారు. హర్యానా లాంటి చిన్న రాష్ట్రంలో ప్రధాని స్థాయి వ్యక్తి అంత ప్రచారం చేయడం సొంత పార్టీ వర్గాలనే ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, త్వరలోనే రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. దాంతో తాము అనుకున్న అభ్యర్థి సులభంగా ఆ గద్దెనెక్కాలంటే మాత్రం తగినన్ని రాష్ట్రాల్లో కూడా అధికారం సాధించడం బీజేపీకి తప్పనిసరి. దానికితోడు ఐదేళ్ల తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి కూడా ఎక్కువ రాష్ట్రాల్లో అధికారాన్ని సొంతం చేసుకోవాలని కమలనాథులు తహతహలాడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం వెలువడే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు ఎవరివైపు మొగ్గు చూపుతాయో, ఎవరికి అధికారాన్ని అందిస్తాయో వేచి చూడాల్సిందే.
గద్దెనెక్కే యోధులెవరు?
Published Sat, Oct 18 2014 4:26 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement