మరోసారి జనం తీర్పు కోసం | Sakshi Editorial On Maharashtra And Haryana Assembly Elections | Sakshi
Sakshi News home page

మరోసారి జనం తీర్పు కోసం

Published Wed, Sep 25 2019 12:18 AM | Last Updated on Wed, Sep 25 2019 12:18 AM

Sakshi Editorial On Maharashtra And Haryana Assembly Elections

సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల తీర్పు వెల్లడైన నాలుగు నెలల తర్వాత మహారాష్ట్ర, హర్యానా శాసన సభలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే నెల 21న ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలుంటాయని, 24న ఫలితాలు వెలువడతాయని కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. వీటితోపాటు 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 64 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలుంటాయి. హర్యానా అసెంబ్లీ గడువు నవంబర్‌ 2తో ముగియనుండగా, మహారాష్ట్ర అసెంబ్లీ గడువు అదే నెల 9తో పూర్తవు తుంది. జనవరి 5 వరకూ గడువున్న జార్ఖండ్‌ అసెంబ్లీకి కూడా వీటితోపాటే ఎన్నికలుండవచ్చునని చాలామంది అంచనా వేశారు. కానీ మూణ్ణెల్ల ముందు జార్ఖండ్‌లో ఎన్నికలు జరపడానికి ఎన్నికల సంఘం సిద్ధపడలేదు.

జమ్మూ–కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370 అధికరణ రద్దు, ఆర్థిక రంగం ఒడిదుడుకులు వంటి పరిణామాలు ఈ నాలుగునెలల వ్యవధిలో చోటుచేసుకున్నాయి. వీటికితోడు మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ ప్రభుత్వాల పనితీరు, అక్కడున్న సమస్యలు కూడా జనం ముందు న్నాయి. కనుక జనం తీర్పు ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. జమ్మూ–కశ్మీర్‌ అంశంలో స్థానికుల మాటెలా ఉన్నా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి పెద్దగా వ్యతి రేకత వ్యక్తం కాలేదు. ఆర్థిక రంగంలో నెలకొన్న అస్థిరత, పర్యవసానంగా ఎదుర్కొంటున్న సమ స్యలపై జనంలో బాగా అసంతృప్తి ఉంది. ఉపాధి లేమి, ప్రత్యేకించి మహారాష్ట్రలో సాగు సంక్షోభం బీజేపీని ఇబ్బందిపెట్టే అంశాలు. ఈమధ్య కేంద్రం వరసబెట్టి తీసుకుంటున్న కొన్ని చర్యలు ఆర్థిక అస్థిరతను ఏమేరకు అరికట్టగలవో చూడాల్సి ఉంది.   

సాధారణంగా ఎన్నికలనేసరికి అధికార పక్షాలకు గుబులుగా ఉంటుంది. తమ పాలనపై ప్రజా భిప్రాయం ఎలా ఉందో... వారి అంచనాలకు తగ్గట్టు తాము పాలించగలిగామా లేదా అన్న విష యాల్లో ఏదో మేరకు సంశయాలుంటాయి. కానీ ఈ రెండుచోట్లా బీజేపీ సమరోత్సాహంతోనే ఉంది. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే కాంగ్రెసే అయోమయావస్థలో ఉంది. మహారాష్ట్రలో మరో ప్రధాన పార్టీ ఎన్‌సీపీ సైతం ఏటికి ఎదురీదుతోంది. మహారాష్ట్రలో బీజేపీ, దాని ప్రధాన మిత్రపక్షం శివసేన అనేక అంశాల్లో పరస్పరం విభేదించుకుంటున్నా ఈ ఎన్నికల్లో కూటమిగా జనం ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే సీట్ల పంపకాలు పొరపొచ్చాలు లేకుండా పూర్తవుతాయా అన్నది చూడాల్సి ఉంది. ఆ విషయంలో రెండు పార్టీలమధ్యా తీవ్ర వైరుధ్యముంది. అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలుంటే అందులో బీజేపీకి 122, శివసేనకు 63మంది సభ్యుల బలం ఉంది. మొత్తం అసెంబ్లీ స్థానాలను చెరిసగం పంచుకుందామని శివసేన ప్రతిపాదిస్తోంది. కనీసం 135 కన్నా తగ్గితే తమకు సమ్మతం కాదంటోంది. కానీ బీజేపీ అందుకు సిద్ధంగా లేదు. చెరిసగం మిత్రపక్షానికి ఇస్తే తమకు లాభసాటి కాదని భావిస్తోంది. రెండు పార్టీలూ వేటికవి తమ తమ స్థానాలను యధాతథంగా ఉంచు కుని, మిగిలిన 103 స్థానాల విషయంలో చర్చించుకుని అవగాహనకు రావాలన్నది బీజేపీ ప్రతి పాదన. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ఒప్పందం ప్రకారం రెండు పార్టీలూ అసెం బ్లీలో చెరిసగం స్థానాలు తీసుకోవాలన్న ఒప్పందం కుదిరిందని శివసేన చీఫ్‌ ఉధవ్‌ ఠాక్రే అంటు న్నారు. సీట్ల పంపకాల చిక్కుముడుల్ని రెండు పార్టీలూ ఎలా పరిష్కరించుకుంటాయన్నది వేచి చూడాలి.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చివరి వరకూ సీట్ల పంచాయతీ తెగకపోవడంతో రెండు పార్టీలూ విడివిడిగా పోటీచేశాయి. ఎన్నికల అనంతరం కూటమి సర్కారులో శివసేన చేరింది. లోక్‌ సభ ఎన్నికల్లో ఇద్దరూ కలిసే పోటీచేశారు. తొలిసారి ఠాక్రే కుటుంబం ఎన్నికల బరిలో నిలబడ బోతోంది. శివసేన యువజన విభాగం యువసేన అధ్యక్షుడు ఆదిత్య ఠాక్రే ఈ ఎన్నికల్లో పోటీచేస్తారు. ఆయనకు సహజంగానే సీఎం పదవిపై కన్నుంది. అందుకే కావొచ్చు...ఆదివారం ముంబైలో జరిగిన ఎన్నికల ర్యాలీలో దేవేంద్ర ఫడణవీసే రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా ఉంటారని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రకటించారు. ఫడణవీస్‌ మహా జనసందేశ్‌ యాత్ర కార్య క్రమం కింద ప్రజలకు చేరువకావడానికి ప్రయత్నించారు. వరదల కారణంగా ఈ యాత్ర రెండు దఫాలుగా నిర్వహించాల్సివచ్చింది. అటు శివసేన కూడా చురుగ్గానే ఉంది. ఆదిత్య ఠాక్రే రాష్ట్రమంతా యాత్ర నిర్వహించారు. హర్యానాలో గత ఎన్నికల్లో బలమైన జాట్‌ సామాజిక వర్గాన్ని దూరంపెట్టి ఇతర వర్గాలను కలుపుకొని బీజేపీ చేసిన ప్రయోగం సత్ఫలితాన్నిచ్చింది. సీఎం పదవి కూడా జాట్‌ కులానికి చెందని మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు అప్పగించారు. మహారాష్ట్రలోనూ ఇలాగే జరిగింది. అక్కడ బలమైన సామాజిక వర్గం మరాఠాలను కాదని బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన ఫడణవీస్‌ను సీఎంగా ఎంపిక చేశారు. హర్యానాలో 90 స్థానాలుంటే బీజేపీ గత ఎన్నికల్లో 47 గెల్చుకుంది. ఈసారి 75 స్థానాలు లక్ష్యంగా పెట్టుకుంది. అధికారంలోకొచ్చిన కొత్తలో జాట్‌ల కోటా ఉద్యమాన్ని, అనం తరం రాంరహీం సింగ్‌ అరెస్టు, అనంతరం జరిగిన హింస వంటి అంశాల్లో తీవ్ర విమర్శలు ఎదు ర్కొన్న ఖట్టర్‌ ఆ తర్వాత నిలదొక్కుకున్నారు. 

ఈ రెండుచోట్లా బీజేపీ గెలుపుపై ఎవరికీ పెద్దగా అనుమానాలు లేవు. మెజారిటీ ఎంతన్నదే సమస్య. ప్రధాన ప్రత్యర్థి పక్షం కాంగ్రెస్‌ నిస్తేజం కావడం ఇందుకు ప్రధాన కారణం. మహారాష్ట్రలో కాంగ్రెస్‌తోపాటు ఎన్‌సీపీ కూడా సంక్షోభంలో ఉంది. రెండు పార్టీలూ సీట్ల పంపకంపై అవగాహన కొచ్చినా కీలక నేతలు బీజేపీ శిబిరానికి తరలిపోవడం వాటికి తలనొప్పిగా మారింది. గత నెలలో రాహుల్‌గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని వదుకోవడంతో  సోనియాగాంధీ ఆ బాధ్యతలు స్వీకరించక తప్పలేదు. ఈలోగానే ముంచుకొచ్చిన రెండు రాష్ట్రాల ఎన్నికలు ఆమెకు పెను సవాలుగా మారాయి. 370 అధికరణ రద్దు విషయంలో పార్టీ నేతలు తలోవిధంగా మాట్లాడటం, పార్టీలో అంతర్గత కుమ్ము లాటలు కాంగ్రెస్‌ను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయి. మొత్తానికి ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలూ బీజేపీకి కాదు...కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement