నేడే ‘మహా’ అసెంబ్లీ ఎన్నికలు
హర్యానా అసెంబ్లీకి కూడా మహారాష్ర్టలో 288 సీట్లు, హర్యానాలో 90 సీట్లకు..
19న ఓట్ల లెక్కింపు
న్యూఢిల్లీ: మహారాష్ర్ట, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మహారాష్ర్టలో మొత్తం 288 స్థానాలకు గాను కాంగ్రెస్ అత్యధికంగా 287 సీట్లలో పోటీ చేస్తుండగా.. బీజేపీ కూటమి 280, శివసేన 282, ఎన్సీపీ 278, ఎంఎన్‌ఎస్ 219 స్థానాల్లో తమ తమ అభ్యర్థులను పోటీలో నిలిపాయి. రాష్ర్టంలోని 8.25 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కుతో 4,119 అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇక హర్యానాలో 90 అసెంబ్లీ సీట్లకు మొత్తం 1,351 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ తొలిసారిగా అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుండటం విశేషం. 1.63 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నెల 19న రెండు రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
మోదీ వర్సెస్ ఇతరులు
ప్రధాని నరేంద్ర మోదీ శక్తి సామర్థ్యాలకు పరీక్షగా నిలుస్తున్న ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ ఈ రెండు రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది. రెండు రాష్ట్రాల్లో గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్న ప్రధాని మోదీ ఏకంగా పది రోజుల్లోనే 38 బహిరంగ సభల్లో ప్రసంగించారు. దీంతో ఈ ఎన్నికలు మోదీకి, ఇతర పార్టీలకు మధ్య పోరులా మారిపోయాయి. సొంతంగానే అధికారం చేజిక్కించుకోడానికి బీజేపీ విశ్వప్రయత్నాలు చేసింది. మహారాష్ర్టలో కాంగ్రెస్-ఎన్సీపీ, బీజేపీ-శివసేన కూటములు విడిపోయి 15 ఏళ్ల తర్వాత తొలిసారి అన్ని ప్రధాన పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక హర్యానాలో పదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను గద్దె దించడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇటు కాంగ్రెస్ పక్షాన ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా రెండు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అవినీతిని మోదీ ఎండగట్టగా.. బీజేపీ హామీలన్నీ దొంగవేనంటూ సోనియా విమర్శలు గుప్పించారు.