స్థానిక ఎన్నికల్లో ఎన్సీపీ హవా
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకుని కంగుతిన్న ఎన్సీపీ మూడు నెలల్లోనే ఊరట కలిగించే ఫలితాలను చవిచూసింది. రాష్ట్రంలోని పలు పురపాలక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. అనూహ్య రీతిలో వెలువడిన ఈ ఫలితాలు అధికార బీజేపీనికలవరపాటుకు గురిచేశాయి.
అటు మున్సిపల్ కార్పొరేషన్, ఇటు మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో ఎన్సీపీ తన హవాను కొనసాగించింది. పుణే, పింప్రి-చించ్‌వడ్‌లో తన పట్టును నిలుపుకున్న ఎన్సీపీ, ఠాణే, ఉల్హాస్‌నగర్‌లలో ఖాతాలు తెరిచింది. మహానగర పాలక సంస్థల్లోని 14 స్థానాల్లో ఎన్సీపీ ఆరు గెలుచుకుంది. పలు మున్సిపల్ కార్పొరేషన్, కౌన్సిళ్లకు ఎన్నికలు, కొన్ని చోట్ల ఖాళీగా ఉన్న స్థానాలకు ఉప ఎన్నికలు ఆదివారం జరిగాయి.
ఓట్ల లెక్కింపు సోమవారం నిర్వహించారు. కార్పొరేషన్లలో శివసేనకు నాలుగు, బీజేపీ, కాంగ్రెస్‌కు రెండు చొప్పున స్థానాలు లభించాయి. అదేవిధంగా నగరపాలక, పంచాయతీ సమితిల్లో మొత్తం 108 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో ఎన్సీపీ 31 స్థానాలు దక్కించుకుని మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత బీజేపీకి 26, శివసేన 20, కాంగ్రెస్‌కు 19 స్థానాలు లభించాయి. వీటితోపాటు ఎన్సీపీ బరిలో దింపిన ముగ్గురు, మరో ఎనిమిది మంది ఇండిపెండెంట్లు కూడా గెలిచారు.
ఠాణే, మీరా-భయందర్‌లలో శివసేన, బీజేపీలు తమ ఆధిపత్యాన్ని నిలుపుకున్నాయి. నాందేడ్‌లో కాంగ్రెస్ తన స్థానాలను తిరిగి గెలుచుకుంది. బీజేపీకి గట్టిపట్టున్న జల్గావ్‌లో ఎన్సీపీ షాక్ ఇచ్చింది. ఇక్కడి 21 సీట్లలో ఎన్సీపీ 11 గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీడ్‌లోని కేజ్ మున్సిపల్ కౌన్సిల్‌ను బీజేపీ నుంచి కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఇక్కడ 17 సీట్లకు గాను ఎనిమిది స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా, బీజేపీ ఆరు స్థానాల్లో గెలుపొందింది. ఈ ఫలితం బీడ్ జిల్లాకు చెందిన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండేకు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కన్నన్ మున్సిపల్ స్థానాన్ని బీజేపీ నిలుపుకుంది.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఎన్సీపీ ప్రతినిధి నవాబ్ మాలిక్ మాట్లాడుతూ, బీజేపీ-సేన ప్రభుత్వం తన వాగ్దానాలను నిలపుకోలేదని అన్నారు. టోల్ మాఫీ చేస్తామని, స్థానిక సంస్థల పన్ను (ఎల్బీటీ) రద్దు చేస్తామని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రావుసాహెబ్ దాణ్వే నిరాకరించారు.