మాజీ సీఎంకు ఎదురుదెబ్బ!
ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ తగలనుంది. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణానికి సంబంధించిన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. కేసు విచారణను ఆ రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేసినట్లు కనిపిస్తోంది. ఆదర్శ్ కేసులో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్పై విచారణ చేపట్టేందుకు గవర్నర్ విద్యాసాగర్ రావు సీబీఐ అధికారులకు గురువారం అనుమతి ఇచ్చారు. దీంతో ఈ కేసును ఆ రాష్ట్ర ప్రభుత్వం మరింత సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆదర్శ్ కుంభకోణానికి పాల్పడ్డవారి పేర్లను సీబీఐ కచ్చితంగా బయటపెట్టాలంటూ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఇటీవలే డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణ సవ్యదిశలో సాగడం లేదని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. కొంతమంది పెద్దలు నేరాలకు పాల్పడిన అనంతరం వారికి వారే క్లీన్ చిట్ పొందడం పరిపాటిగా మారిందని ఇటీవలే మండిపడగా.. తాజాగా మాజీ సీఎం చవాన్ పై విచారణ చేపట్టాలని సీబీఐకి కేసు అప్పగించారు.
ఆదర్శ్ కుంభకోణం ఇదీ..
అమరులైన జవాన్ల కుటుంబాల కోసం ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఆదర్శ్ సొసైటీ భవనాన్ని నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తన బంధువులకు ఇళ్లు ఇప్పించడంతో ఈ కేసులో ఇరుక్కుని పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. 2010లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన అనంతరం అశోక్ చవాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన ఈ కుంభకోణంలో నిందితుడిగా పలు కేసులను ఎదుర్కొంటున్నారు.
అది కేవలం బీజేపీ ప్రతీకారేచ్ఛ చర్య: చవాన్
తనపై సీబీఐ విచారణకు గవర్నర్ ఆదేశించడం బీజేపీ ప్రతీకారేచ్చను సూచిస్తుందని అశోక్ చవాన్ పేర్కొన్నారు. బీజేపీ ప్రోద్బలంతోనే తనపై విచారణ చర్యలకు దిగుతున్నారని వ్యాఖ్యానించారు. ఆర్మీ అధికారుల కుటుంబాలకు కేటాయించినట్లు ఎక్కడా పేర్కొనలేదని... అది కేవలం మహారాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని ప్లేస్ అని వివరించారు. జస్టిస్ పాటిల్ కమిటీ రిపోర్టులో ఈ విషయం స్పష్టంగానే ఉందని.. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నంత మాత్రాన ఆదర్శ్ కుంభకోణం అంశంలో గవర్నర్ తన నిర్ణయాన్ని ఏ విధంగా మార్చుకుంటారని మాజీ సీఎం చవాన్ మండిపడ్డారు.