ఈసారీ అధికారం మాదే
ముంబై : వరుసగా నాలుగో పర్యాయం కూడా తమనే ప్రజలు ఎన్నుకుంటారని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ ధీమా వ్యక్తం చేశారు. నగరంలో శని వారం ఆయన శాసనసభ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘లోక్‌సభ ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా ఓ గాలి వీచింది.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, శాసనసభ ఎన్నికల ఫలితాలు వేర్వేరుగా ఉంటాయి. ఈ రెండింటి మధ్య తే డా ఉంటుంది. ఎవరికి పగ్గాలను అప్పగించాలనే విషయం ప్రజలకు తెలుసు. వారు తెలివైన నిర్ణయం తీసుకుంటారు. మహారాష్ట్రను అభివృద్ధి విషయంలో మరింత బాగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాం. అందువల్లనే ప్రజలను ఓట్లు వేయాల్సిందిగా కోరనున్నాం’ అని అన్నారు.
అమిత్ షా డైరీ నిండా కోర్టు కేసుల తేదీలే
కేరళ గవర్నర్‌గా పి.సదాశివన్‌ను నియమించడమేమిటని ఆయన ప్రశ్నించారు.బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై కేసులు ఎత్తివేసినందుకు కృతజ్ఞతగానే ఆయనకు ఈ పదవిలో నియమిస్తున్నారనే వదంతులు షికార్లు చేస్తున్నాయన్నారు. ఈ క్విడ్‌ప్రోకోలో నిజమెంతనే విషయం తనకు కూడా తెలియదన్నారు. షా డైరీ నిండా కోర్టు కేసులకు సంబంధించిన తేదీలే ఉంటాయన్నారు.
ఫిరాయింపుదారులంతా అవకాశవాదులే
అనేకమంది ఎన్సీపీ నాయకులు, మాజీ మంత్రులు బీజేపీలో చేరుతున్నారు కదా అని ప్రశ్నించగా వారంతా అవకాశవాదులేనని పవార్ అన్నారు. అటువంటి వారి గురించి తానేమీ మాట్లాడదలుచుకోలేదన్నారు.
రాష్ట్రాన్ని ఎవరూ విడదీయలేరు
రాష్ట్రాన్ని ఏ శక్తీ విడదీయలేదని ఎవరూ విడదీయలేరని పవార్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాయన్నారు.
అవన్నీ అవాస్తవాలు
అనంతరం ఎన్సీపీ నాయకుడు అజిత్‌పవార్ మాట్లాడుతూ రాష్ర్టంలో రూ. 11 లక్షల కోట్ల మేర కుంభకోణాలు జరిగాయంటూ అమిత్‌షా ఇటీవల చేసిన విమర్శలను ఖండించారు. అవన్నీ అవాస్తవాలన్నారు.
గుజరాత్‌లో ప్రారంభించారా?
అనంతరం ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ భారత్‌లో త్వరలో బులెట్ రైలును ప్రవేశపెడతామని చెబుతున్న ప్రధాని మోడీ గుజరాత్‌లో మోనో లేదా మెట్రో రైలును ప్రారంభించారా అని ప్రశ్నించారు.