
నన్ను కేసులో ఇరికించారు: టాప్ హీరో
కొచ్చి: ‘నేను అమాయకుడిని. నా నిర్దోషితత్వాన్ని నిరూపించుకుంటా. నన్ను కుట్రపూరితంగా ఇరికించార’ని ప్రముఖ మలయాళ హీరో దిలీప్ వ్యాఖ్యానించారు. ప్రముఖ నటిపై అత్యాచారయత్నం, కిడ్నాప్ కేసులో ఆయనను సోమవారం సాయంత్రం కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ.. ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. తనను అన్యాయంగా కేసులో ఇరికించారని వాపోయారు.
దిలీప్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయనను కొచ్చికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలువా ప్రాంత సబ్‌జైలుకు తరలించారు. జైలు బయట కొంత మంది యువకులు ‘వెల్‌కమ్ టు సెంట్రల్ జైలు’ అంటూ నినాదాలు చేశారు. దిలీప్ చివరిసారిగా 2016లో ‘వెల్‌కమ్ టు సెంట్రల్ జైలు’లో నటించారు. కొచ్చిలోని ఆయన హోటల్‌పై ఆందోళనకారులు దాడి చేశారు.
బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు దిలీప్ తరపు న్యాయవాది కె. రామకుమార్ తెలిపారు. తదుపరి విచారణ కోసం దిలీప్‌ను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కూడా న్యాయస్థానాన్ని కోరనున్నారు. ఈ కేసులో ఆయన పాత్రను నిర్ధారించే 19 సాక్ష్యాలను సంపాదించినట్టు పోలీసులు వెల్లడించారు.