సాక్షి, న్యూఢిల్లీ : దేశానికి స్వాతంత్య్రం వచ్చిన దాదాపు ఐదు దశాబ్దాల అనంతరం భారత రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. ముఖ్యంగా 1990వ దశకం నుంచి జాతీయ పార్టీ కాంగ్రెస్ బలహీన పడుతూ రాగా, ప్రాంతీయ పార్టీలు బలపడుతూ వచ్చాయి. ఈ పార్టీలు తమ ప్రాంతీయ తత్వాన్ని చాటుకునేందుకుగాను బ్రిటీష్ కాలం నాటి నగరాల ఇంగ్లీషు పేర్లను మారుస్తూ వచ్చాయి. అలా బాంబే ముంబైగా, మద్రాస్ చెన్నైగా, కలకత్తా కోల్‌కతాగా మారాయి. మరో జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ బలపడుతూ రావడంతో ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని కాపాడుకునేందుకు మరోసారి ప్రాంతీయ రాజకీయాలను ఆశ్రయించాల్సి వచ్చింది.
తమిళ ప్రాంతీయతను కాపుడుకునేందుకు ద్రావిడ మున్నేట్ర కళగం, ఒడియా గుర్తింపు కోసం బిజూ జనతా దళ్, కన్నడ గుర్తింపు కోసం కర్ణాటక కాంగ్రెస్, బెంగాలీ గుర్తింపు కోసం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు చర్యలు ప్రారంభించాయి. దానికి కొనసాగింపుగానే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గురువారం నాడు ‘పశ్చిమ బెంగాల్’ రాష్ట్రం పేరును ‘బంగ్లా’గా మార్చాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత బెంగాల్ రాష్ట్ర విభజనను సూచిస్తున్న పశ్చిమ బెంగాల్ పేరు శాశ్వతంగా మరుగున పడిపోతుంది. ఇప్పటికే స్థానిక బాషలో బెంగాల్‌ను బంగ్లాగా పిలుస్తున్న విషయం తెల్సిందే. మమతా బెనర్జీ గత జనవరి నెలలోనే ప్రత్యేక బెంగాల్ స్టాంప్‌ను తీసుకొచ్చారు. ప్రత్యేక రాష్ట్రీయ గీతాన్ని కూడా తీసుకొస్తున్నట్లు తెల్సింది.
హిందూత్వ వాదంతో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి దూసుకొస్తున్న బీజేపీని కట్టడి చేయడానికే మమతా బెనర్జీ ఈ చర్యలు తీసుకుంటున్నారని ఎవరైనా గ్రహించవచ్చు. వాస్తవానికి ఆమె 2017, మే నెలలోనే ఇలాంటి చర్యలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బెంగాలీ భాషను తప్పనిసరిచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డార్జిలింగ్‌లో నేపాలీ మాట్లాడే గోర్ఖాలు ఆందోళన చేయడంతో ఆమె తక్షణం ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. ఒకప్పుడు ప్రత్యేక గోర్ఖాలాండ్ ఉద్యమాన్ని ప్రోత్సహించడం ద్వారా మమతా బెనర్జీ లాభపడ్డారు. ప్రత్యేక గోర్ఖాలాండ్ డిమాండ్‌కు ఎప్పటి నుంచో బీజేపీ మద్దతు ఇస్తుండడం, 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఆ పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యంలో డార్జిలింగ్ విషయంలో తొందరపడడం మంచిది కాదన్న దృష్టితో వెంటనే వెనక్కి తగ్గారు.
హిందూత్వ ప్రచారంలో భాగంగా శ్రీరామనవమి సందర్భంగా బీజేపీ, ఆరెస్సెస్‌లు కోల్‌కతాలో కొత్తగా ర్యాలీలు నిర్వహించడంతో పరాయి సంస్కృతిని తీసుకొస్తున్నారంటూ ముందుగా దూషించిన మమతా బెనర్జీ చివరకు బెంగాలీ సంస్కృతి ప్రతిబింబించేలా శ్రీరామ నవమి ర్యాలీలను పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఎన్ని చేసినా వచ్చే ఎన్నికల్లో మమతా బెనర్జీ ఏమేరకు లాభ పడతారన్నది ప్రస్తుతానికి ప్రశ్నే. ఎందుకంటే కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రాంతీయతత్వాన్ని ప్రోత్సహించడంలో భాగంగా కేంద్రం హిందీ భాషను రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. బెంగుళూరును బెంగళూరుగా మార్చింది. ప్రత్యేక రాష్ట్రీయ పతాకాన్ని తీసుకొచ్చింది. పాలనాపరంగా మంచి ప్రభుత్వం అనిపించుకుంది. అయినా ఎన్నికల ఫలితాల్లో బీజేపీకంటే ఎంతో వెనకబడింది.
Comments
Please login to add a commentAdd a comment