ఎయిర్ హోస్టెస్‌లతో అనుచిత ప్రవర్తన, అరెస్ట్
నాగపూర్ : మద్యం సేవించిన ఓ ప్రయాణికుడు (23) ఇద్దరు ఎయిర్ హోస్టెస్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అరెస్ట్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ముంబై నుంచి నాగపూర్ వస్తున్న జెట్ ఎయిర్ వేస్‌లో శనివారం చోటుచేసుకుంది. హార్ట్‌వేర్ వ్యాపారి ఆకాశ్ గుప్తా ముంబై నుంచి నాగపూర్ ప్రయాణం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి భోజనం సర్వ్ చేసేందుకు వచ్చిన ఎయిర్ హోస్టెస్‌ల చేతులు పట్టుకుని లాగి, అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం.
దీంతో వారు ఈ విషయాన్ని క్రూ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లారు. అయితే వారితో కూడా ఆకాశ్ గుప్తా వాగ్వివాదానికి దిగటంతో కెప్టెన్ ఈ విషయాన్ని బాలఘట్ (మధ్యప్రదేశ్) సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకుని, అనంతరం సోనేగావ్ పోలీసులకు అప్పగించారు. ఆకాశ్ గుప్తాపై సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచారు. నిందితుడిని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. కాగా విమానంలో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తిస్తే వారిని అదుపు చేసేందుకు ప్లాస్టిక్ హ్యాండ్ కప్స్ (సంకెళ్లు) వేసేందుకు విమానయాన సంస్థలకు 2016 జనవరి నుంచి అనుమతి లభించిన విషయం తెలిసిందే.