చిరుతపులి కనబడితే ఏం చేస్తారు.. భయంతో పారిపోతారు, లేదా దాన్ని భయపెట్టి తరిమేయడానికో ప్రయత్నిస్తారు. అంతేగానీ దాన్ని చంపేసే ప్రయత్నం ఎవరైనా చేస్తారా? ఢిల్లీ శివార్లలోని గుర్‌గ్రామ్ వాసులు మాత్రం సరిగ్గా అలాగే చేశారు. సాహసోపేతంగా వ్యవహరించిన ఓ యువకుడు దాని మెడపట్టి గట్టిగా బంధించగా, మిగిలినవాళ్లంతా కర్రలతో కొట్టి మరీ దాన్ని చంపేశారు. తర్వాత గ్రామంలో దాని మృతదేహాన్ని ఊరేగించారు. ఈ ఘటనతో కొన్ని గంటల పాటు ఊరంతా భయంతో వణికిపోయింది. ఉదయం 8.10 గంటల సమయంలో ఈ చిరుతపులి గుర్‌గ్రామ్ సమీపంలోని మండవర్ గ్రామంలోకి ప్రవేశించింది. దాదాపు మూడు గంటల పాటు అక్కడే తిరిగింది. కాసేపటి వరకు ఎవరూ దాని సమీపానికి వెళ్లడానికి కూడా సాహసించలేదు.
ఎట్టకేలకు ఉదయం 11.45 గంటల ప్రాంతంలో దాన్ని తరుముకుంటూ ఒక ఖాళీ ఇంటిలోకి వెళ్లేలా చేశారు. కానీ అది అక్కడినుంచి ఇంటి పైకి ఎక్కడమే కాక, అక్కడ ఉన్న ఓ అమ్మాయి మెడ మీద పంజా విసిరింది. దాంతో అక్కడే ఉన్న ఓ యువకుడు ధైర్యంగా ముందుకెళ్లి వెనక నుంచి దాని మెడ గట్టిగా పట్టుకున్నాడు. మిగిలినవాళ్లంతా కలిసి దాన్ని కర్రలతో కొట్టి చంపేశారు. ఈ ఘటనలో గాయపడిన గ్రామస్తులను సమీపంలోని సోహ్నా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆరావళి పర్వత శ్రేణుల ప్రాంతాల్లో ఉన్న చిరుతలు ఇటీవలి కాలంలో తరచు గ్రామాల్లోకి వస్తున్నాయి. తాము కూడా చిరుతను చంపకపోయేవాళ్లమని, కానీ పోలీసులు.. అటవీ శాఖాధికారుల వద్ద కనీసం మత్తు ఇంజెక్షన్లు కూడా లేవని, కేవలం ఒక వలతో వచ్చారని గ్రామస్తులు చెప్పారు. చిరుత దాడితో గ్రామంలో ఏడుగురు గాయపడినా పోలీసులు చూస్తూ ఊరుకున్నారు తప్ప ఏపమీ చేయలేదని దేవేందర్ సింగ్ అనే గ్రామవాసి మండిపడ్డారు.
