ఫేక్ జర్నలిస్టు ఆటకట్టు
తిరువనంతపురం: పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి ఘటనలో వీరమరణం పొందిన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాంతీయ దినపత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టుగా చెప్పుకుంటున్న అన్వర్ సాధిక్(24) ను మలప్పురం జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు.
టెర్రర్ దాడి సమయంలో గ్రెనేడ్ ను నిర్వీర్యం చేసే క్రమంలో అసువులు బాసిన నిరంజన్, అతని కుటుంబంపై అన్వర్ సాధిక్ అమర్యాదకరమైన వ్యాఖ్యలను ఫేస్బుక్ లో పోస్ట్ చేసినట్లు పోలీసులు ఆరోపించారు. అతనిపై ఐపిసి 124 ( ఎ) ( దేశద్రోహం ) కింద కేసులు నమోదు చేశారు. సదరు పత్రిక ఫిర్యాదు ఆధారంగా జర్నలిస్ట్ గా నటిస్తున్న అతగాడిని అరెస్ట్ చేశామని తెలిపారు.