
కత్తితో దాడి..రూ.17 లక్షలు దోపిడీ
రాజ్ కోట్(గుజరాత్): పట్టపగలే ఓ ఉద్యోగిని కత్తితో భయపెట్టి దోపిడిచేశారు. ఈ ఘటన గుజరాత్ లోని రాజ్కోట్ లో పట్టపగలే జరగడం గమనార్హం. గుర్తుతెలియని ముగ్గురు దుండగులు అతడి వద్ద ఉన్న రూ.17 లక్షల నగదు బ్యాగును అపహరించారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. సునీల్ లాల్ వాని అనే అతను సహోద్యోగితో కలిసి రూ.37 లక్షలు ఓ బ్యాంకు నుంచి డ్రా చేశారు. ఈ తర్వాత రూ.17 లక్షలు సునీల్ తీసుకుని తన బైక్ పై వెళ్తున్నాడు.
మార్గంమధ్యలోనే ముగ్గురు దుండగులు సునీల్ బైక్ ను అడ్డగించి, అతనిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. సునీల్ వద్ద ఉన్న నగదు బ్యాగును ఇవ్వాలని బెదిరించారు. చివరకు నగదు బ్యాగు దోపిడీ చేసి అక్కడి నుంచి వారు పరారయ్యారని పోలీసులు తెలిపారు. దుండగుల జరిపిన కత్తిదాడిలో సునీల్ ఎడమ చేతికి గాయాలయ్యాయి. అయితే, జరిగిన విషయాన్ని అదే ప్రాంతంలో ఓ ఇంటికి అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయిందని వారు వివరించారు. సునీల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు వీడియో ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.