ఆలస్యంగా వెలుగుచూసిన షాకింగ్ ఘటన
ఇటార్సి: మధ్యప్రదేశ్ లో జరిగిన షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రైలులో ఓ యువకుడి పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ఘటన సంచలనం రేకెత్తించింది. ఓ యువకుడిని రైలుకు కట్టేసి వేలాడదీయడం స్థానికంగా కలకలం రేపింది. ఇటార్సి రైల్వేస్టేషన్ లో ఈ నెల 25న ఇది జరిగింది. తాగునీటి విషయంలో తలెత్తిన వివాదంతో ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు.
తమ బాటిల్ లోని మంచినీళ్లు తాగాడనే కోపంతో యువకుడిపై ముగ్గురు దాడి చేశారు. అతడి పాంట్ ఊడదీశారు. అక్కడితో ఆగకుండా ఊడదీసిన పాంట్ తో అతడి రెండు కాళ్లను రైలు కిటికీ కట్టేశారు. కొంతసేపు అలాగే నిలుచుకున్న బాధితుడు తర్వాత పట్టుతప్పడంతో తలకిందులుగా రైలుకు వేలాడాడు. అక్కడున్నవారంతా అతడిని కాపాడేందుకు ప్రయత్నించలేదు. ఈ దారుణోదంతానికి సంబంధించిన ఫొటోలు వెలుగులోకి రావడంతో పోలీసులు స్పందించారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.