
సినీఫక్కీలో అనుమానిత ఉగ్రవాది పరారీ
ఇటార్సీ: మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ సమీపంలో పోలీసుల అదుపులోంచి ఓ అనుమానిత ఉగ్రవాది సినీఫక్కీలో తప్పించుకున్నాడు. కోర్టు విచారణ కోసం పీటీ వారంట్‌పై తమిళనాడులోని వెల్లూరు నుంచి సయ్యద్ అహ్మద్ అలీ(38)ని యూపీలోని లక్నోకు రైల్లో తీసుకెళ్తుండగా మార్గమధ్యలో పరారయ్యాడు. రప్తీసాగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇటార్సీ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో చేతులకు బేడీలు ఉండగానే అందులోంచి దూకి పారిపోయాడు.
వెల్లూరు పోలీసులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత స్థానిక పోలీసులకు, ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్)కు సయ్యద్ పరారీ గురించి తెలిపారు. అతడిని పట్టుకునేందుకు ముమ్ముర గాలింపు జరుపుతున్నారు. త్రిపురకు చెందినట్టుగా సర్టిఫికెట్ సంపాదించిన సయ్యద్ బంగ్లాదేశ్ కు చెందినవాడై ఉంటాడని అనుమానిస్తున్నారు.