కోలుకుంటున్న మేనకా గాంధీ
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ (60) మరో మూడు నుంచి నాలుగు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె చాలా బలహీనంగా ఉన్నప్పటికీ తన ఆరోగ్యానికి ప్రమాదమేమి లేదని పేర్కొన్నారు. ఆదివారం ఆమెకు శస్త్ర చికిత్స చేసి ఉదరంలో ఉన్న రాయిని తొలగించామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
జూన్ 2 న మేనకా గాంధీ తన నియోజకవర్గమైన ఉత్తర ప్రదేశ్‌లోని పిలిభిత్‌లో పర్యటిస్తుండగా హఠాత్తుగా కడుపునొప్పి రావడంతో స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. స్కానింగ్ చేయగా ఆమె పిత్తాశయం (గాల్‌బ్లాడర్)లో ఓ రాయి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో శస్త్రచికిత్స చేసి రాయిని తొలగించినట్లు వైద్యులు వివరించారు.