
‘కేజ్రీవాల్.. మీరు మెన్స్ డే స్టార్ట్ చేయండి’
న్యూఢిల్లీ: పురుషులకు కూడా ప్రత్యేకంగా ఒక రోజును అంకితం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖా మంత్రి మేనకాగాంధీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సూచించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎన్నో కొత్తకొత్త కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఆయన ఇప్పుడు ఢిల్లీలో పురుషుల దినోత్సవం పాటించాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది చాలా ముఖ్యమైన రోజు. అయితే, పురుషులకు కూడా ఏడాదిలో ఒక ప్రత్యేకమైన రోజు అంటూ అంకింతం చేస్తే న్యాయం చేసినట్లవుతుందని నేను భావిస్తాను’ అంటూ చెప్పారు.
మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ఢిల్లీలోని మహిళా కమిషన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్‌లోని ఐయామ్ ఈక్వల్ అనే పేరుతో జరుగుతున్న ప్రచారంలో దేశంలోని మహిళలంతా చేరాలని విజ్ఞప్తి చేశారు. ‘మనమంతా ఒక్కటే అని చెప్పడం ప్రతి ఒక్కరూ ప్రారంభించాలి. ఏదో ఒక రోజు సమానత్వం వస్తుందని నేను బలంగా చెప్పగలను’ అని అన్నారు. అంతకుముందు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేజ్రీవాల్ ట్విట్టర్‌లో పలు ట్వీట్లు చేశారు.
మహిళలపై వేధింపులకు పాల్పడేవారిని అన్‌ఫాలో చేయాలని, మహిళలపై బెదిరింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళలకోసం ఒక రోజు మాత్రమే జరుపుకుంటుంటే మిగితా 364 రోజులు పురుషుల దినోత్సవాల్లాగా కనిపిస్తోందని, మొత్తం 365 రోజులు కూడా మహిళలకే ఉండాలంటూ కూడా ఆయన ట్వీట్లలో పేర్కొన్నారు. అయితే, ఢిల్లీ యూనివర్సిటీలో ఇటీవల ఏబీవీపీ విద్యార్థులు, ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థుల మధ్య రేగిన వివాదం నేపథ్యంలో ఆయన ట్వీట్లు చేసినట్లు పలువురు విమర్శించడంతో కేజ్రీవాల్‌కు ప్రత్యేకంగా మెన్స్ డే జరపాలని సూచించినట్లు తెలుస్తోంది.