కేంద్ర మంత్రులు మేనకా గాంధీ - ప్రకాష్ జవదేకర్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసిన హైదరబాదీ హంటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్ వ్యవహారంలో మరో ట్విస్ట్ వచ్చింది.
కేంద్ర మంత్రులు మేనకాగాంధీ - ప్రకాష్ జవదేకర్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసిన హైదరబాదీ హంటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్ వ్యవహారంలో మరో ట్విస్ట్ వచ్చింది. న్యూ ఢిల్లీలో జరిగిన ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో ఆయనతో పాటు పాల్గొన్న ఓ జంతు ప్రేమికురాలు ఆయనతో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా తనను తీవ్రస్థాయిలో బెదిరించారని అలీ ఖాన్ ఆరోపించారు. దీనిపై ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలాతో పాటు ఆ నగర పోలీసు కమిషనర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
బీహార్ రాష్ట్రంలోని మకామా ప్రాంతంలో అడవి నుంచి బయటకు వచ్చి పంట పొలాలను ధ్వంసం చేస్తున్న నీల్గయ్‌ల్ని నియంత్రించడానికి ఆ ప్రభుత్వం కోరడంతో గత వారం అలీ ఖాన్ అక్కడకు వెళ్లారు. బీహార్ ప్రభుత్వంతో పాటు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకున్న ఆయన నాలుగు రోజుల్లో 300 నీల్గయ్‌లను చంపారు. ఈ విషయంపై ఓ జాతీయ ఛానల్ గత గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఉన్న జంతు ప్రేమికురాలు మనేకాగాంధీని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే ఆమె తన సహచర మంత్రి ప్రకాష్ జవదేకర్‌తో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారడంతో ఓ ప్రముఖ ఛానల్ అలీ ఖాన్‌ను చర్చకు ఆహ్వానించింది.
ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు గౌరీ మౌలేఖీ అనే జంతు ప్రేమికురాలు పాల్గొన్నారు. చర్చ జరిగిన సమయంలోనే కాకుండా అది ముగిసిన తర్వాతా గౌరీ వ్యక్తిగత విమర్శలకు దిగారని అలీ ఖాన్ ఆరోపించారు. చర్చానంతరం తిరిగి వస్తున్న తనను ఆ ఛానల్ కార్యాలయంలోనే అడ్డగించిన గౌరి తీవ్రంగా బెదిరించారని, తప్పుడు కేసులు బనాయించడంతో పాటు భౌతిక దాడులకు పాల్పడతామంటూ హెచ్చరించారని ఢిల్లీ సీఎం, పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. తనపై ఆరోపణలకు దిగిన గౌరి కేంద్ర మంత్రి మేనకా గాంధీని సలహాదారులు ఉన్నట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కార్యాలయం మంగళవారం ఈ-మెయిల్ ద్వారా అలీ ఖాన్‌కు జవాబు ఇచ్చింది. ఫిర్యాదులోని ఆరోపణలపై అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తామని, ఆపై అవసరమైన చర్యలు తీసుకుంటామని కేజ్రీవాలా ఓఎస్‌డీ అందులో స్పష్టం చేశారు.
మూడు తరాల నుంచి సమాజం కోసం మ్యానీటర్స్‌గా మారిన పులులు, చిరుతలతో పాటు అమాయకుల్ని పొట్టనపెట్టుకున్న ఏనుగుల్ని మాత్రమే వేటాడుతున్నాం. ప్రతి అంకంలోనూ ఆయా ప్రభుత్వాలు అధికారికంగా కోరి, అవసరమైన అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ పని చేస్తున్నాం. పట్టుకోవడం, మత్తు ఇవ్వడం సాధ్యం కాని పక్షంలోనే ఆఖరి అవకాశంగా ఆయా జంతువుల్ని చంపాల్సి వస్తోంది. ఇవన్నీ పట్టించుకోకుండా కొందరు వ్యక్తిగత దూషణలు, భౌతిక దాడుల బెదిరింపులకు దిగడం సమంజసం కాదు’ అని నషత్ అలీ ఖాన్ సాక్షి’తో అన్నారు.