
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యారన్న అపవాదు మూటగట్టుకున్న పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మౌనం దాల్చారు. గుజరాత్ ఫలితాలపై స్పందించాలని మీడియా పట్టుబట్టినా ఎలాంటి వ్యాఖ్యలూ చేయని మణిశంకర్ నో కామెంట్ అంటూ సున్నితంగా తిరస్కరించి వార్తాపత్రికను చదవడంలో మునిగిపోయారు.
మోదీపై తన వ్యాఖ్యలు పెనుదుమారం రేపడంతో మౌనంగా ఉండటమే మేలని అయ్యర్ భావిస్తున్నారు. అంతకుముందు గుజరాత్ ఎన్నికల ప్రచార పర్వంలో ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఆయనను నీచుడంటూ సంభోధించడం వివాదాస్పదమైంది. ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అయ్యర్‌ను సస్పెండ్ చేసింది.
గుజరాత్ ఎన్నికల్లో అయ్యర్ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను దెబ్బతీసాయని స్వయంగా ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానించడం గమనార్హం. అయ్యర్ వ్యాఖ్యలతో గుజరాత్‌లో తమ కొంప మునిగిందని పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ వాపోయారు. పార్టీ శ్రేణుల నుంచి దాడి పెరగడంతో మౌనంగా ఉండటమే మేలని మణిశంకర్ అయ్యర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment