
బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన మంత్రివర్గ ప్రత్యేక సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఓ వైపు రాష్ట్రంలో రాజకీయం సంక్షోభం వెంటాడుతున్నా మాంఝీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మాజీ సీఎం నితీష్ కుమార్ మహాదళిత్ కేటగిరీలో నుంచి తొలగించిన పాశ్వాన్ కులాన్ని తిరిగి అదే కేటగిరిలో చేర్చాలనే ప్రతిపాదనకు మాంఝీ ఆమోదం తెలిపారు. గతంలో నితీష్ కుమార్ మహాదళిత్ కేటగిరిలోంచి తొలగించిన పాశ్వాన్ కులాన్ని మళ్లీ అదే కేటగిరిలో చేర్చుతూ నిర్ణయంచడం సంచలంనం కలిగించింది.
షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు వికాస్ మిత్రాను నియమించే ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జర్నలిస్టులకు కూడా మాంఝీ వరాలు కురిపించారు. జర్నలిస్టుల పెన్షన్ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిప్రకారం విలేకరులకు పదవీవిరమణ తర్వాత ప్రభుత్వం ప్రతినెలా 5000 రూపాయలు చెల్లించనుంది. జర్నలిస్టులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు కూడా నెలకు 2500 రూపాయలు చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లకు లబ్ధి చేకూరనుంది.