ఏ పదవిచ్చినా స్వీకరిస్తా: అద్వానీ
అహ్మదాబాద్: కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని బీజేపీయే ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ ధీమా వ్యక్తంచేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్టీ తనకు ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానని పేర్కొన్నారు. ఆయన ఆదివారం గాంధీనగర్ నియోజకవర్గంలోని బవ్లా నుంచి తన రోడ్‌షో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుత యూపీఏ ప్రభుత్వాన్ని గద్దె నుంచి దించాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారని పేర్కొన్నారు. ‘‘కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎన్నికల తర్వాత నాకు ఇచ్చే ఎలాంటి పాత్రనైనా పోషిస్తాను’’ అని స్పష్టంచేశారు. దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ తగినన్ని సీట్లు సాధిస్తుందని అభిప్రాయపడ్డారు.
బలహీన ప్రధానిని ధ్రువీకరించింది...
మన్మోహన్‌సింగ్ బలహీన ప్రధానమంత్రి అనడానికి ఆయన మాజీ సలహాదారు సంజయ్ బారు రాసిన పుస్తకమే అధికారిక ధ్రువీకరణ అని అద్వానీ వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్‌లో అద్వానీ విలేకరులతో మాట్లాడారు. ‘‘మన ప్రధానులందరిలో మన్మోహన్ అత్యంత బలహీనమైన వ్యక్తి అని నేను తొలిసారి అన్నప్పుడు.. ఆయన చాలా మంచి వ్యక్తి అని, ఎందుకు ఆయన్ను విమర్శిస్తారని నా సొంత సహచరులే అడిగారు. నేనూ బాధపడుతున్నానని, ఆయనపై సానుభూతి ఉందని చెప్పాను. మన్మోహన్ బలహీన ప్రధాని అనే విషయం ప్రపంచానికి ఎప్పుడో తెలుసు. దాన్ని బారు తన పుస్తకంతో అధికారికంగా ధ్రువీకరించారు’’ అని పేర్కొన్నారు.