ప్రధాని అభ్యర్థుల మధ్య చర్చకు అద్వానీ మద్దతు
పితోర్‌గఢ్: అమెరికాలో అధ్యక్ష పదవికి పోటీ పోడే అభ్యర్థుల మధ్య చర్చల తరహాలోనే మనదేశంలోనూ ప్రధాని పదవికి పోటీ పడే ప్రధాన అభ్యర్థుల మధ్య చర్చ ఉండటానికి బీజేపీ అగ్రనేత అద్వానీ మద్దతు పలికారు. బీజేపీ లోక్‌సభ అభ్యర్థి అజయ్ టామ్టాకు మద్దతుగా గురువారం ఇక్కడ జరిగిన ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా అద్వానీ మాట్లాడారు. రాజకీయ పార్టీలు ర్యాలీలు నిర్వహించడానికి బదులు ఎన్నికల సంఘమే ప్రధాని పదవికి పోటీ పడే అభ్యర్థుల మధ్య చర్చలు నిర్వహించాలని అద్వానీ అభిప్రాయం వ్యక్తం చేశారు. స్వర్ణ చతుర్భుజి పేరుతో రహదారుల నిర్మాణం, మూడు రాష్ట్రాల ఏర్పాటు వాజ్‌పేయి సారధ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం సాధించిన విజయాలుగా చెప్పారు.
నీట సమస్యను తీర్చడానికి నదులను అనుసంధానం చేయాలన్న ఎన్డీయే విధానాన్ని యూపీఏ ప్రభుత్వం అనుసరించలేదని విమర్శించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ మరింత బలోపేతం కావాల్సిన అవశ్యం ఉందని అద్వానీ తెలిపారు.