
యూపీలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విధ్వంసానికి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం) పన్నిన కుట్రను ఉత్తరప్రదేశ్ యాంటీ టైస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు భగ్నం చేశారు.
ఎన్నికల సందర్భంగా
విధ్వంసానికి కుట్ర
మోడీ సహా సీనియర్ నేతలే లక్ష్యం
గోరఖ్‌పూర్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విధ్వంసానికి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం) పన్నిన కుట్రను ఉత్తరప్రదేశ్ యాంటీ టైస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు భగ్నం చేశారు. ఐంఎకు చెందిన ఇద్దరు ఆత్మాహుతిదళ సభ్యులను బుధవారం రాత్రి గోరఖ్‌పూర్‌లోని రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఓ క్యాబ్‌లో యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరి నుంచి రెండు ఏకే 47 రైఫిళ్లు, ఓ పిస్టల్, పేలుడు పదార్థాలు, భారత్, నేపాల్‌కు చెందిన సిమ్‌కార్డులు, కొన్ని కీలక పత్రాలు, భారత్, నేపాల్, పాకిస్థాన్, అమెరికాలకు చెందిన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీతో పాటు పలువురు సీనియర్ నేతలే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు వీరు వ్యూహం పన్నినట్టు అనుమానిస్తున్నారు. ఇటీవల అరెస్ట్ చేసిన ఇండియన్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ తెహ్‌సీన్ అక్తర్ అరెస్ట్ తర్వాత ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమాచారంతో వీరిని అరెస్ట్ చేసినట్టు ఏటీఎస్ ఐజీ రాజీవ్ సబర్వాల్ తెలిపారు. అరెస్ట్ చేసిన ఇద్దరినీ ముర్తాజా అలియాస్ అబ్దుల్ వలీద్, మహ్మద్ ఒవైస్ అలియాస్ ఫహీమ్‌లుగా గుర్తించారు. వీరిద్దరూ 2010-11 మధ్య అఫ్ఘానిస్థాన్‌లో తెహ్రీక్ ఈ తాలిబన్ సంస్థ వద్ద ఉగ్రవాద శిక్షణ తీసుకున్నారని యూపీ ఐజీ అమరేంద్ర కుమార్ సెంగర్ చెప్పారు. విచారణ సమయంలో తాము పాకిస్థాన్‌లోని కరాచీ వాసులమని అంగీకరించారని చెప్పారు.